ఆదివారం 24 జనవరి 2021
National - Nov 25, 2020 , 00:05:51

పెండ్లికి మతం చూడం

పెండ్లికి మతం చూడం

  • హిందువా, ముస్లిమా అన్నది కోర్టులు చూడవు
  • జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు మేజర్లకు ఉంది
  • లవ్‌ జిహాద్‌ వివాదం నేపథ్యంలో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: లవ్‌ జిహాద్‌, మతాంతర వివాహాలపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేజర్లకు (మహిళలకు 18, పురుషులకు 21) తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉన్నదని, కలిసి జీవించేందుకు చట్టం వారికి అనుమతిస్తున్నదని పేర్కొంది. ఈ విషయంలో వారు హిందువా, ముస్లిమా అన్నది కోర్టులు చూడవని తెలిపింది. అలాగే వారి ప్రశాంత జీవితంలో కుటుంబం కానీ, ఇతర వ్యక్తులు కానీ జోక్యం చేసుకోకూడదని స్పష్టంచేసింది.  వారి బంధానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పరాదని స్పష్టంచేసింది. ముస్లిం యువకుడు, హిందూ యువతి వివాహానికి సంబంధించిన కేసులో కోర్టు మంగళవారం ఈ మేరకు తీర్పు చెప్పింది. 

ఇదీ కేసు..

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన సలామత్‌ అన్సారీ, ప్రియాంక కన్వర్‌ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2019 ఆగస్టు 19న పెండ్లి చేసుకున్నారు. పెండ్లి తర్వాత ప్రియాంక ఇస్లాంలోకి మారారు. పేరును అలియాగా మార్చుకున్నారు. అయితే తన కుమార్తెను కిడ్నాప్‌ చేసి, బలవంతంగా వివాహం చేశారని ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సలామత్‌, మరో ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో కేసును కొట్టివేసి, తమకు రక్షణ కల్పించాలని సలామత్‌, ఇతరులు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రియాంక వయసుపై వివాదం లేదని, పెండ్లి సమయంలో ఆమె వయసు 21 ఏండ్లు అని తెలిపింది. భర్తతో కలిసి జీవించేందుకు ఆమెకు అనుమతినిస్తూ కేసు కొట్టివేసింది.


logo