గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 02:59:04

థియేటర్లకు అనుమతివ్వలేదు

థియేటర్లకు అనుమతివ్వలేదు

  • బడులు, కోచింగ్‌సెంటర్లకు కూడా.. 
  • యోగాకేంద్రాలు, జిమ్‌లకు అనుమతి 
  • రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేత
  • అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల్లో భాగంగా కేంద్రం బుధవారం అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే అంతా ఊహించినట్లు సినీ థియేటర్లను తెరిచేందుకు అనుమతినివ్వలేదు. థియేటర్లు, బడు లు, కోచింగ్‌ సెంటర్లను ఆగస్టు 31దాకా తెరువవద్దని పేర్కొన్నది. అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసింది. కంటైన్మెంట్‌జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. బార్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగుతుందన్నది. ఈ మార్గదర్శకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 

యోగాకేంద్రాలు, వ్యాయామశాలలను (జిమ్‌) వచ్చే నెల 5 నుంచి తెరువొచ్చని, అయితే అక్కడ భౌతిక దూరం లాంటి కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలనూ కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలన్నది. మెట్రోరైళ్లపై నిషేధం, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతాయని, వందేభారత్‌మిషన్‌ కింద కొంతమంది ప్రయాణికులనే అనుమతిస్తామన్నది. దశలవారీగా వైమానిక సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

వివాహానికి గరిష్ఠంగా 50 మంది, అంతిమ సంస్కారాలకు 20 మంది కంటే ఎక్కువ హాజరుకావొద్దని సూచించింది. రాష్ర్టాలు స్థానిక పరిస్థితులను బట్టి కంటైన్మెంట్‌ జోన్ల బయట ఈ నిబంధనల సడలింపులపై నిర్ణయం తీసుకోవచ్చన్నది. వృద్ధులు, పిల్లలు ఇంట్లోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అందరూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.


logo