శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 26, 2020 , 00:06:34

సామాన్యుడి రైలు సమాధి!

సామాన్యుడి రైలు సమాధి!

  • ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పేదల జీవనవాహిని
  • బడాబాబులకు అప్పనంగా అప్పగిస్తున్న బీజేపీ
  • కోట్లమంది పేదలు ఇక రైలు ఎక్కడం గగనమే
  • ప్రమాదంలో 13 లక్షల ఉద్యోగుల జీవితాలు 
  • మోదీ నిర్ణయంతో కోట్లమంది ఉపాధికి ఎసరు
  • లాభాలు వచ్చే రూట్లలోనే ప్రైవేటు రైళ్లు
  • అనేక దేశాల్లో విఫలమైన రైల్వేల ప్రైవేటీకరణ 
  • బీజేపీ సర్కారుపై రైల్వే ఉద్యోగుల ఉద్యమాస్త్రం 

పేదవాడి రైలుబండి పెద్దల జేబుల్లోకి పరుగెడుతున్నది. కోట్లమంది జీవనాధారం కొద్దిమంది లాభార్జన వస్తువుగా మారుతున్నది. రైల్వే స్టేషన్‌లో చాయ్‌ అమ్ముకొని బతికానని చెప్పుకుంటున్న నాయకుడే రైలును ముక్కలుగా ఊడబీకి తక్కెడలో తూకం వేస్తున్నారు. అభివృద్ధి కోసమేనంటూ చెవిలో ‘పువ్వు’లు పెట్టి.. ఉన్న ఆధారాన్నీ లాగేసుకుంటున్నారు. రైల్వే ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి బతుకుపై చావు దెబ్బ కొడుతున్నది.  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మన దేశంలో పేదవాడి ప్రయాణ సాధనం రైలే. రోడ్డు రవాణాకంటే కూడా రైల్వే ప్రయాణమే చౌక. అందుకే రాష్ర్టాలు దాటి ఉపాధి కోసం వలసపోయే లక్షల మంది కార్మికులు రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసేవారికి కూడా రైలే జీవనయాన సాధనం. కోట్ల మంది విద్యార్థులకూ రైలే చదువుల చోదకం. ఏడాదికోనాడు కుటుంబంతో అలా తీర్థయాత్రకో, విహార యాత్రకో వెళ్లాలన్నా రైలే సంతోషాల సాధనం. దేశంలో ప్రతి పౌరుడు తనదే అనుకొనే ఆస్తి భారతీయ రైల్వే. కానీ.. ఇక ముందు మన రైలు బండి పరాయిపరం కాబోతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేలను ప్రజల నుంచి లాగేసుకొని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టబోతున్నది. మెరుగైన సేవలు అందించేందుకేనంటూ.. సగటు జీవి అసలు రైలే ఎక్కలేని పరిస్థితులు కల్పిస్తున్నది. ఇప్పటికే ఎంపికచేసిన మార్గాల్లో ప్రైవేటు సంస్థలు రైళ్లను నడిపేందుకు అనుమతి ఇచ్చింది. రైల్వేస్టేషన్‌లో చాయ్‌ అమ్ముకున్నానని చెప్పుకొనే ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వమే ఈ చర్యకు పాల్పడటం విశేషం. 

మొదట బడ్జెట్‌ను ఎత్తేశారు.. ఇప్పుడు బోగీని బోల్తాకొట్టిస్తున్నారు

2014లో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రైల్వేలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి కుట్రలు మొదలయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1924లో మొదలైన రైల్వే బడ్జెట్‌ ప్రస్థానానికి 2016లో మోదీ సర్కారు ముగింపు పలికింది. ఆ చర్యతోనే రైల్వేలను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర వేగవంతమైందని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. కొద్దిమంది బడా పెట్టుబడిదారులకు అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన ప్రధాని మోదీ.. ఊహించినట్టుగానే రైల్వేల ప్రైవేటీకరణను మొదలుపెట్టారు. 109 మార్గాల్లో 151 ప్రైవేటు రైళ్లు నడిపేందుకు ప్రైవేటు సంస్థలకు ఈ ఏడాది జూలై 1న ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మార్గాల్లో చాలావరకు లాభాల్లో ఉన్నవే కావటం గమనార్హం. నిజానికి కోట్లమంది పేదలు నిత్యం ప్రయాణించే ప్రభుత్వరంగ సంస్థకు లాభాలు ప్రధానం కాదు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఏ ప్రభుత్వమూ అలా లాభాల కోసం ఆలోచించదు. కానీ బీజేపీ సర్కారు మాత్రం నష్టాలు వస్తున్నాయని.. బుల్లెట్‌ రైళ్లు తెస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్తూ ప్రైవేటు వ్యక్తులకు రైల్వేలను ధారాదత్తం చేస్తున్నదని రైల్వే కార్మికులు విమర్శిస్తున్నారు.

ఉద్యోగుల పరిస్థితి ఏంటి?  

ఏడాది కిందటి లెక్కల ప్రకారమే భారతీయ రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో రైల్వేలే ప్రధానమైనవి. ఇప్పుడు ఒక్కో మార్గాన్నీ ప్రైవేటుపరం చేస్తూ వెళ్తే ఉద్యోగుల పరిస్థితి ఏంటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించే కుట్రలో భాగంగానే ప్రైవేటుకు అప్పగిస్తున్నారని రైల్వే కార్మికులు మండిపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఉద్యమాలు, నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆందోళన తెలిపామని, భవిష్యత్తులోనూ ఉద్యమం కొనసాగిస్తామంటున్న రైల్వే ఉద్యోగులు కొందరిని నమస్తే తెలంగాణ పలకరించింది.

ప్రైవేటు రైళ్లు పేదలు ఎక్కగలరా?

మెరుగైన సేవలు అందించేందుకే దేశంలో సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు, బుల్లెట్‌ రైళ్లు ప్రవేశపెడుతున్నామని మోదీ ప్రధాని అయిన కొత్తలో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ బుల్లెట్‌ రైళ్లు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మళ్లీ అదే మాటలు వల్లెవేస్తూ రైల్వేను ప్రైవేటు పరం చేస్తున్నారు. సాధారణంగా రైళ్లలో ప్రయాణించేది పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులే. వీరిలో చాలామంది తమవెంట తమ సంతానాన్ని, కొంత వరకు లగేజీలను కూడా తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఈ లగేజీలకు, చిన్నారులకు టికెట్లు లేకున్నా ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. మరి ప్రైవేటు రైళ్లలో అనుమతిస్తారా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు రైళ్లు నడిపేవారికి లాభార్జనే ప్రధానం. ప్రతిచోటా ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు చిన్నపిల్లలకు, చిన్నచిన్న లగేజీలకు కూడా చార్జీలు వేస్తే సగటు ప్రయాణికుడు రైలు ఎక్కలేని పరిస్థితి వస్తుందని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. 

రైల్వే ఘన చరిత్రకు పాతర

భారతీయ రైల్వేకు గొప్ప చరిత్ర ఉన్నది. దేశంలో 1832లో మొదలైన రైలు ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతున్నది. నేడు భారతీయ రైల్వే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌. 2019లో మన రైల్వే 844 కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేసింది. 123 కోట్ల టన్నుల సరుకులను రవాణా చేసింది. 68,155 కిలోమీటర్ల రైల్వే లైన్లపై రోజూ 15, 523 ప్యాసింజర్‌ రైళ్లు పరుగెడుతున్నాయి. 9,146 గూడ్సు రైళ్లు రోజూ సరుకులను రవాణా చేస్తున్నాయి. 2019 మార్చినాటికి భారతీయ రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఉద్యోగులపరంగా ప్రపంచంలోనే ఎనిమిదో అతిపెద్ద సంస్థ. ఇంతటి ప్రాధాన్యం ఉండి, భారతీయుల జీవనవాహినిగా కొనసాగుతున్న రైల్వేలకు బీజేపీ గ్రహణం పట్టింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించటాన్ని స్వాగతించాల్సిందే.. కానీ ఆ పేరుతో ప్రజలు రైళ్లు ఎక్కలేని పరిస్థితులు కల్పించటం మోదీ ప్రభుత్వానికే చెల్లిందని రైల్వే ఉద్యోగులు, ప్రజలు మండిపడుతున్నారు. 

ఇతర దేశాల్లో విఫలమైంది

రైల్వేలను వివిధ విభాగాలుగా విభజించి ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోకో ఇంజిన్లు, కోచ్‌లను ఎక్కడైనా తయారు చేసుకొనే వెసులుబాటు ప్రైవేటు వారికి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న లోకో, కోచ్‌ల తయారీ యూనిట్లు, వర్క్‌ షాపులను ప్రైవేకరిస్తారు. స్టేషన్లు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ఎప్పుడో నిర్ణయించారు. విమానాశ్రయాల మాదిరిగానే రాబోయే రోజుల్లో రైల్వే స్టేషన్లు ఖరీదుగా మారుతాయి. దీంతో సామాన్య ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమవుతారు. బ్రిటన్‌లో రైల్వే ప్రైవేటీకరణ పూర్తిగా విఫలమైంది. అర్జెంటీనాలో రైల్వేలను ఒక ఎంఎన్‌సీకి అప్పగించటంతో 39 వేల కిలోమీటర్ల నెట్‌వర్క్‌ మూతపడింది. కేవలం 800 కిలోమీటర్లు మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి. అక్కడ 95వేల ఉద్యోగుల్లో ప్రస్తుతం 15వేల మంది మాత్రమే మిగిలారు. అనేక పెట్టుబడిదారీ వ్యవస్థలున్న దేశాల్లో సైతం రైల్వేలను ప్రభుత్వమే నడుపుతున్నది. రైల్వేలు ప్రైవేటుపరమైతే లాభాలు వచ్చే రూట్లలో మాత్రమే రైళ్లు నడిపిస్తారు. దాంతో అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకుండా పోతుంది. 

- శివ కుమార్‌, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ , ఆర్‌ఎంయూ 

50 ఏండ్లు వెనక్కి పోతాం

రైల్వేల్లో అతి తక్కువ ఖర్చులో ప్రయాణాలు చేయవచ్చు. అందుకే కోట్లమంది ప్రజలు రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు. దీనిని  ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే పేదలు రైలు ప్రయాణం చేయలేరు. కరోనా సంక్షోభంలోనూ ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా రైల్వే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటుపరం చేస్తే 50 ఏండ్లు వెనక్కి పోతాం. ఉద్యోగులు రోడ్డున పడుతారు. కొత్తగా ఉద్యోగాలు రావు. ప్రైవేటులో ఉద్యోగులకు భద్రత ఉండదు. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలి. 

- ఎం సత్యనారాయణ, అధ్యక్షుడు, సికింద్రాబాద్‌ డివిజన్‌, ఆర్‌ఎంయూ 

ప్రజలే కాపాడుకోవాలి..

హైదరాబాద్‌ నగరం లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నది. నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలది కీలక భూమిక. అలాంటి సంస్థలన్నింటినీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నది. రైల్వేల పరంగా సికింద్రాబాద్‌ దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రస్థానం. ప్రస్తుతం వస్తున్న ప్రైవేటు సంస్థలు ప్రభుత్వరంగం పునాదులపైనే ఏర్పడుతున్నాయి. మిడి మిడి జ్ఞానంతో ప్రభుత్వరంగ సంస్థలను విమర్శించటం ఇప్పుడు ఫ్యాషన్‌ అయిపోయింది. కేవలం హైదరాబాదే కాదు.. దేశ భవిష్యత్‌ను నిర్మించింది ప్రభుత్వరంగమే. ఆ తరువాతనే ప్రైవేటురంగం వచ్చింది. ప్రజలు వీటన్నింటినీ గ్రహించాలి. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. 

- వీ అరుణ్‌కుమార్‌, చైర్మన్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌ జనరల్‌ బ్రాంచ్‌ 

బడా పారిశ్రామికవేత్తలకే ప్రయోజనం

రైల్వే ప్రైవేటీకరణ ద్వారా కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలకు తప్ప ఎవరికీ లాభం ఉండదు. దీన్ని ఎదుర్కోవడానికి అన్ని సంఘాలు కలిసి పోరాడుతున్నాయి. ఇప్పటికే క్యాటరింగ్‌ సెక్షన్‌ను ప్రైవేటుపరం చేశారు. అక్కడ సమస్యలు రావడంతో తిరిగి రైల్వేకు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. క్రమంగా ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత ఉద్యోగులను భర్తీ చేయకుండా ప్రైవేటు వారిని తీసుకుంటూ పూర్తిగా ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తున్నది. 

- ఎన్‌ సరోజిని రెడ్డి, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ, ఆర్‌ఎంయూ 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతోనే నష్టాలు..

అనేక దేశాల్లో రైల్వేల ప్రైవేటీకరణ విఫలం కావడంతో తిరిగి వెనక్కి తీసుకున్నారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, నార్వే సహా అనేక దేశాల్లో రైల్వేలను మళ్లీ ప్రభుత్వమే తీసేసుకున్నది. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం అందించే ప్రజా రవాణా సంస్థ ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. రైల్వేలను ప్రైవేటీకరిస్తున్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్రం తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వరంగ సంస్థల నష్టాలకు కేంద్రం తీసుకునే నిర్ణయాలే కారణం. కానీ వాటిని ఉద్యోగుల మీదికి నెట్టడం సరికాదు.  

- భిక్షపతి, డివిజనల్‌ సెక్రటరీ, రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌  


logo