బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 16:54:26

కరోనా పోరులో ప్రసార మాధ్యమాల పాత్ర భేష్! : వెంకయ్య

కరోనా పోరులో ప్రసార మాధ్యమాల పాత్ర భేష్! : వెంకయ్య

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు సరైన, అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ అనుక్షణం వారిని అప్రమత్తం చేయడంలో ప్రసారమాధ్యమాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘కరోనాపై పోరులో ప్రసార మాధ్యమాల అసమాన పాత్ర’ పేరుతో ఆదివారం ఫేస్‌బుక్‌ వేదికగా విడుదల చేసిన వ్యాసంలో.. గతకొద్ది నెలలుగా వైరస్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచడంలో.. జాగ్రత్తగా ఉండేందుకు ప్రభుత్వాలు చేసిన సూచనలు నిరంతరం ప్రజలకు చేరవేయడంలో మీడియా పోషించిన పాత్రను అభినందించారు. కరోనాపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులతోపాటు ముందువరసలో నిలిచిందన్నారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ.. వైరస్ విస్తృతి, కరోనాపై పోరాటానికి అవసరమైన సన్నద్ధత, సమాజం పోషించాల్సిన బాధ్యత తదితర అంశాల్లో ప్రజలను చైతన్య పరుస్తూ.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో మనోధైర్యం కలిగించి ఆందోళన తగ్గించడంలో మీడియా అసమానపాత్ర పోషించిందన్నారు. దీంతోపాటుగా పార్లమెంటరీ వ్యవస్థలో.. కరోనా, సమాజంలోని వివిధ వర్గాలపై దీని ప్రభావం తదితర అంశాలపై చర్చ జరిగేలా అజెండాను కూడా మీడియా సూచించిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

మాస్కులు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఆరోగ్యకరమైన భోజనం, మానసిక ఒత్తిడినుంచి బయటపడేందుకు అవసరమైన శారీరక వ్యాయామం, ఆధ్యాత్మికత ఆవశ్యకత తదితర అంశాలను ప్రచారం చేయడంలో మీడియా అసమాన పాత్ర పోషిస్తున్నదని ఉపరాష్ట్రపతి అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రసారమాధ్యమాలు, జర్నలిస్టులు ప్రజలను చైతన్యపరచడంలో తమ బాధ్యతను విస్మరించక వృత్తి ధర్మానికి కట్టుబడ్డారని, వారి చొరవను, సంకల్ప స్ఫూర్తిని అభినందిస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

ప్రజలను కరోనాపై అప్రమత్తం చేసే ప్రక్రియలో చాలా మంది విలేకరులు కరోనా బారిన పడగా, కొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కర్తవ్యనిష్ఠకు కట్టుబడి ప్రాణాలు కోల్పోయిన మీడియా సిబ్బందికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కేవలం అధికారిక, ధ్రువీకృత సమాచారాన్ని మాత్రమే వెల్లడించాలని.. లేనిపక్షంలో అనవసర అపోహలతో ప్రజల్లో ఆందోళన నెలకొనే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి సూచించారు.


logo