శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 10:07:15

ఐదు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ఐదు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

న్యూఢిల్లీ : కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఆయా రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు. ఆంధ్రులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికై ప్రార్ధిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా ‘కర్ణాటక  సోదరీమణులు, సోదరులకు కర్ణాటక రాజ్యోత్సవ శుభాకాంక్షలు. కర్ణాటక ప్రజల ఆనందం, మంచి ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రాచీన కాలం నుంచి వివిధ సంస్కృతులకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం పురోగతి.. శ్రేయస్సు మార్గంలో కొనసాగాలని మోదీ ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్‌ కీలక రంగాల్లో విశేషమైన పురోగతి సాధిస్తోందని, ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం చేసుకోవడంలో దీర్ఘకాలిక సహకారం అందిస్తోందన్నారు. ‘కేరళ పిరవి దినోత్సవం’ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘కేరళ సహజ సౌందర్యం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షించిందన్నారు. కేరళ నిరంతర పురోగతి కోసం ప్రార్థిస్తున్నాను’ ట్వీట్ చేశారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.