గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 20:17:51

మణిపూర్ ‌లో నీటి సరఫరా ప్రాజెక్టు కు శంఖుస్థాపన చేసిన - ప్రధానమంత్రి

మణిపూర్ ‌లో నీటి సరఫరా ప్రాజెక్టు కు శంఖుస్థాపన చేసిన - ప్రధానమంత్రి

ఇంఫాల్: మణిపూర్‌లో నీటి సరఫరా ప్రాజెక్టు కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ "దేశం యావత్తూ కోవిడ్-19 కు వ్యతిరేకంగా నిరంతరాయంగా పోరాడుతున్నది. తూర్పు ,ఈశాన్య భారతదేశం భారీ వర్షాలు, వరదల వంటి  సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. దీని ప్రభావంతో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు, అనేకమంది నిరాశ్రయులయ్యారు. "లాక్ డౌన్ సమయంలో మణిపూర్ ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసిందనీ, ముఖ్యంగా వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రధానమంత్రి  చెప్పారు.

"ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మణిపూర్‌లో సుమారు 25 లక్షల మంది పేదలు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందారని" ఆయన చెప్పారు. "అదేవిధంగా, మణిపూర్‌లో 1.5 లక్షల మందికి పైగా మహిళలకు ఉజ్జ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సౌకర్యం కల్పించారు. మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో అమలు చేస్తున్న ఈ నీటి సరఫరా ప్రాజెక్టు   రాష్ట్రంలో నీటి సమస్యలను తగ్గిస్తుందనీ, ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు భారీ ఉపశమనం కలిగిస్తుందని" ఆయన పేర్కొన్నారు. "గ్రేటర్ ఇంఫాల్ తో పాటు, 25  పట్టణాలు , రాష్ట్రంలోని 1,700 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని "నరేంద్రమోదీ చెప్పారు. రాబోయే రెండు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు ను రూపొందించామన్నారు. 


logo