సోమవారం 25 జనవరి 2021
National - Dec 04, 2020 , 03:42:27

రంగంలోకి రజినీకాంత్‌

రంగంలోకి రజినీకాంత్‌

  • జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు
  • అభిమానులకు తలైవా న్యూ ఇయర్‌ గిఫ్ట్‌
  • రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ
  • ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి
  • ప్రాణాలు పోయినా లెక్క చేయను
  • రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తథ్యమన్న సూపర్‌ స్టార్‌ 

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ అరంగేట్రంపై సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు రజినీకాంత్‌ గురువారం ప్రకటించారు. పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 31న వెల్లడిస్తామని ట్వీట్‌ చేశారు. తద్వారా తన అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. తమ పార్టీ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందని తలైవా స్పష్టం చేశారు. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు అనివార్యమని, ఆ మార్పు తనతోనే సాధ్యమని చెప్పారు. అవినీతి లేని, స్వచ్ఛమైన, ఆధ్యాత్మిక విలువలతో కూడిన రాజకీయాలకు బాటలు వేస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని, ఈ క్రమంలో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనని అన్నారు. ‘ప్రజల సంక్షేమం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వస్తే ఆ విషయంలో నాకంటే ఎక్కువగా ఎవరూ సంతోషించరు. నేను ఎప్పుడూ మాట తప్పను. రాజకీయ మార్పు చాలా ముఖ్యం. ఇప్పుడు మార్పు జరగకపోతే ఇంకెప్పుడూ జరగదు. మనం ప్రతీదాన్ని మార్చేద్దాం’ అని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 

2017లోనే పార్టీపై ప్రకటన

రజినీకాంత్‌ వయస్సు 70 ఏండ్లు. ఆయన రాజకీయాల్లోకి రావడంపై రెండు దశాబ్దాలుగా చర్చ నడుస్తున్నది.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తలైవా 2017లోనే ప్రకటించారు. ఈ ఏడాది మొదట్లోనే పార్టీని ప్రారంభించాలని భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. 2016లో రజినీకి మూత్రపిండాల మార్పిడి జరిగింది. కొవిడ్‌ ముప్పు నేపథ్యంలో రజినీ రాజకీయాల్లోకి వెళ్లవద్దని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో తలైవా రాజకీయ రంగ ప్రవేశం వాయిదా పడుతూ వచ్చింది. 

5 నెలల్లోనే సాధ్యమా?

  • ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు
  • ఇంత స్వల్పకాలంలో రజినీఅధికారాన్ని అందుకోగలరా?
  • బీజేపీతో కలిసి తలైవాపోటీ చేసే అవకాశం

ఇంకో 5 నెలల్లో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజినీ రాజకీయ రంగప్రవేశంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యే అవకాశం ఉన్నది. రజినీ స్టార్‌డమ్‌ కారణంగా పార్టీలు పొత్తులపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని రజినీ చెప్తున్నారు. అయితే 5 నెలల స్వల్పకాలంలో ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి రావడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ, సీఏఏ అంశాల్లో రజినీ బీజేపీకి మద్దతిచ్చారు. అవసరమైతే ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రజినీ మద్దతు కోరతామని బీజేపీ అధికారప్రతినిధి నారాయణ్‌ త్రిపాఠి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నది. రాబోయే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని ప్రకటించింది. కానీ రజినీ ఎంట్రీతో బీజేపీ చూపు ఆయన వైపు మళ్లుతుందనేది కొందరి వాదన. ఎట్లా చూసిన తలైవాతో ఏఐఏడీఎంకేకు ఎక్కవ దెబ్బ పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాను కుల, మత రాజకీయాలు చేయనని, ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానని రజినీ చెప్తున్నారు. తమిళనాట కులం ప్రభావం ఎక్కువ. ఇంత స్వల్ప కాలంలో దానిని దాటుకొని రజినీ నిలబడగలరా అన్నది అనుమానమే. రజినీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ వారంతా పార్టీ క్యాడర్‌గా మారతారని చెప్పలేం. ఓటింగ్‌ శాతాన్ని సీట్లుగా మలుచుకోవాలంటే సంస్థాగత నిర్మాణం తప్పనిసరి అని విశ్లేషకులు చెప్తున్నారు. 


logo