శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 29, 2020 , 13:36:56

మాతృభాష‌ను ఉపాధి రంగంతో అనుసంధానించాలి

మాతృభాష‌ను ఉపాధి రంగంతో అనుసంధానించాలి

న్యూఢిల్లీ: జ్ఞాన స‌ముపార్జ‌న‌కు మాతృభాష ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని, అమ్మ‌భాష ద్వారానే పిల్ల‌ల్లో సృజ‌నాత్మ‌క‌త పెరుగుంద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. 90 శాతం దేశాలు మాతృభాష‌లోనే విద్యాబోధ‌న చేస్తున్నాయ‌ని తెలిపారు. హెద‌రాబాద్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యం, తెలుగు విభాగం ఆధ్వ‌ర్యంలో జ‌్ఞాన సముపార్జ‌న మాధ్య‌మం-మాతృభాష అనే అంశంపై నిర్వ‌హించిన వెబినార్‌ను ప్రారంభించారు. ఇంగ్లిష్ ద్వారా మాత్ర‌మే అభివృద్ధి జ‌రుగుతుంద‌న‌డం స‌రికాద‌ని చెప్పారు. నాలుగువేల ఏండ్ల చ‌రిత్ర ప‌రిశీలిస్తే ఇదంతా అర్థ‌మ‌వుతుంద‌న్నారు. 

అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాష‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, మాతృభాష‌లో ప‌రిశోధ‌న చేసిన‌వారికే నోబెల్ బ‌హుమ‌తులు వ‌చ్చాయ‌ని చెప్పారు. విదేశీ నేత‌లు చాలామంది మాతృభాష‌లోనే మాట్లాడుతార‌ని, ఇంగ్లిష్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అనేక‌మంది అగ్ర‌నేత‌లు వారి అమ్మ‌భాషే మాట్లాడ‌తార‌ని చెప్పారు. అన్ని రాష్ట్రాలు అధికార భాష‌ను మరింత ప్రోత్స‌హించాల‌ని, సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లోనే ప‌రిపాల‌న జ‌ర‌గాల‌ని సూచించారు.

 ప్ర‌స్తుత త‌రం చిన్నారులు పెద్ద‌బాల‌శిక్ష‌, వేమ‌న‌, సుమ‌తి శ‌త‌కాలు చ‌ద‌వాల‌ని సూచించారు. మాతృభాష‌ను ఉపాధి రంగంతో అనుసంధానించాల‌ని, వివిధ రంగాల అవ‌స‌రాలు తీర్చేలా మారిస్తేనే మాతృభాష‌కు మ‌నుగ‌డ ఉంటుంద‌ని చెప్పారు. భార‌త్‌లో ఉన్న‌న్ని భాష‌లు మ‌రే దేశంలో లేవ‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో సుర‌క్షిత దూరం, స్వీయ నియంత్ర‌ణ ప‌దాల‌ను సృష్టించామ‌ని, మాతృభాష‌ను మరింత లోతుగా ప‌రిశీలిస్తే ఎన్నో ప‌దాలు తెలుస్తాయ‌ని చెప్పారు. 


logo