శనివారం 28 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 01:34:56

మోదీ ఫెయిల్‌

మోదీ ఫెయిల్‌

  • కరోనా పోరులో చతికిలబడిన కేంద్రం
  • ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన బీజేపీ
  • పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో మోదీ సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. మహమ్మారి నియంత్రణలో, రోగులకు చికిత్స అందించడంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షాలు, నిపుణులు ఆరోపిస్తుండటం తెలిసిందే. తాజాగా వైరస్‌ కట్టడిలో బీజేపీ సర్కార్‌ చతికిలపడిందని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా కుండబద్దలు కొట్టింది. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వైద్యరంగానికి తక్కువ నిధులను కేటాయించి.. సర్కార్‌ దవాఖానలను పట్టించుకోలేదని తేల్చి చెప్పింది. ప్రైవేటు దవాఖానల ఆగడాలకు కళ్లెం వేయడంలో కూడా విఫలమైందని మండిపడింది. ఫలితంగా ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలు ఇష్టారీతిన ప్రజలను దోచుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం (హెల్త్‌) చైర్‌పర్సన్‌ రామ్‌గోపాల్‌ యాదవ్‌.. రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్య నాయుడికి శనివారం ఒక నివేదికను సమర్పించారు. కొవిడ్‌-19పై పార్లమెంటరీ కమిటీ వెలువరించిన తొలి నివేదిక ఇదే.  పార్లమెంటులోని ఓ అత్యున్నత కమిటీ ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతూ నివేదికను అందజేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నది. 

నివేదికలోని ముఖ్యాంశాలు 

  • దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ దవాఖానల్లో పడకలు, వైద్య సదుపాయాలు తగినంతగా లేవు.
  • సర్కార్‌ దవాఖానల్లో వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు ప్రైవేటు దవాఖానల వైపునకు వెళ్తున్నారు. ఇదే అదునుగా ఆ దవాఖానల యాజమాన్యాలు ప్రజలను ఇష్టారీతిన దోచుకుంటున్నాయి.
  • ప్రైవేటు దవాఖానలను నియంత్రించడంలో కేంద్రం ఫెయిల్‌ అయింది.
  • 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు చాలా తక్కువ.