మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 15:55:38

ఒకప్పుడు పాఠశాలలను కూల్చిన మావోయిస్టులే.. ఇప్పుడు తిరిగి నిర్మిస్తున్నారు

ఒకప్పుడు పాఠశాలలను కూల్చిన మావోయిస్టులే.. ఇప్పుడు తిరిగి నిర్మిస్తున్నారు

దంతెవాడ : ఒకప్పుడు 2007-09 సంవత్సరాల మధ్య మావోయిస్టులు కూల్చివేసిన పాఠశాలలను ఇప్పుడు తిరిగి వారే నిర్మిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌ దంతేవాడ జిల్లాలోని గ్రామాల్లో లొంగిపోయి సాధారణ జీవితాన్ని గడుపుతున్న మావోలు ఇప్పుడు పాఠశాలల నిర్మాణానికి పూనుకున్నారు. ఈ పాఠశాలలు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా (మావోయిస్ట్) భైర్మగర్‌, మలంగీర్, కటేకళ్యాన్ కమిటీ పరిధిలోకి వస్తాయి. 

జిల్లా ప్రధాన కార్యాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భన్సీ మసాపా గ్రామంలో కూల్చివేసిన పాఠశాల భవన నిర్మాణం వారం రోజుల క్రితం స్థానిక గ్రామస్తులు, లొంగిపోయిన మావోయిస్టుల సాయంతో ప్రారంభమైంది. "అప్పట్లో మావోయిస్టులుగా ఉన్న గ్రామస్తులు 2012లో సీనియర్ మావోయిస్టుల సూచన మేరకు మా గ్రామంలోని పాఠశాలను కూల్చేశారు. వాటిని వారి సాయంతోనే మళ్లీ పునర్నిర్మిస్తున్నాం. తద్వారా మా పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని అనుకుంటున్నాం. మా పిల్లలు కూడా విదేశాలకు వెళ్లి ఉద్యోగం పొందాలని ఆశ పడుతున్నాం’’ అని భన్సీ మసాపా గ్రామ సర్పంచ్‌ అజయ్ తెలం అన్నారు. 

ఇవే కాకుండా మావోయిస్టులు పొటాలి, బుర్గం, నహ్రీ, కుట్రేమ్, ఆల్నార్ గ్రామ పంచాయతీల పరిధిలో కూడా పాఠశాలలు నిర్మిస్తున్నారు. "ఈ పాఠశాలలు జిల్లాలోని కోర్ మావోయిస్టు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటీవల ఒక పాఠశాల నిర్మాణం భన్సీలో ప్రారంభమైంది. ఈ గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో మావోయిస్టులు లొంగిపోయినప్పుడు పాఠశాలల నిర్మాణానికి సాయం చేసే విధంగా బాధ్యత తీసుకున్నారని’’ అని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ అన్నారు. గ్రామస్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పాఠశాల నిర్మాణం ఒక ప్రక్రియలో జరుగుతోందని దంతేవాడ పోలీసులు పేర్కొన్నారు. 

జిల్లా యంత్రాంగం లొంగిపోయిన ఈ మావోయిస్టులను స్వయం సహాయక బృందాలుగా (ఎస్‌హెచ్‌జీ) ఏర్పాటు చేసింది. ఈ బృందం పాఠశాలల నిర్మాణ ప్రక్రియలో సాయపడుతుందని పోలీసులు తెలిపారు. 

"గతంలో మావోయిజంలో చేరిన గ్రామానికి చెందిన స్థానిక యువకులు, ఈ ప్రాంతాన్ని సందర్శించే మావోయిస్టులందరికీ తెలుసు కాబట్టి ఈ స్వయం సహాయక సంఘం వారిలో కూడా మార్పు తెస్తుంది. పాఠశాల నిర్మాణంలో మావోలు సాయం చేయడం ప్రారంభించిన తరువాత ఇతర మావోయిస్టులు కూడా ఆ దిశగా ఆలోచన చేసి లొంగిపోయే అవకాశం ఉంది. దిగువ-స్థాయి కార్యకర్తలు కూడా లొంగిపోతే మిగిలిన పాఠశాలల నిర్మాణ పనులు కూడా గాడిలో పడతాయి.”అని ఒక ఇంటెలిజెన్స్ అధికారి పేర్కొన్నారు. 

"ఒకప్పుడు పాఠశాలలను నాశనం చేసిన వారే ఇప్పుడు తిరిగి నిర్మిస్తున్నారు. ఈ యువకులు గతంలో చాలా నేరాలు చేశారనే అపరాధం నుంచి బయటపడటానికి ఈ సాయం ఉపయోగపడుతుందని ’’ఎస్పీ పల్లవ అన్నారు. గ్రామస్తుల్లో విద్య ప్రాముఖ్యతను గ్రహించడం స్వాగతించదగిన మార్పు. యువతకు అవసరమైన సాయాన్ని పోలీసులు చేస్తారు. "మృదువైన పోలీసింగ్ కూడా బస్తర్‌లో దశాబ్దాలుగా మారిన నక్సల్ సమస్యను పరిష్కారానికి ఉపయోగపడుతుందని’’ ఎస్పీ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo