మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 21:11:00

హత్రాస్ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు లక్నో బెంచ్

హత్రాస్ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు లక్నో బెంచ్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ‌సంచలనం రేపిన 19 ఏండ్ల దళిత యువతిపై సామూహిక లైంగికదాడి ఘటనను అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై ఈ నెల 12వ తేదీలోగా స్పందన తెలియజేయాలంటూ ఏసీఎస్ హోం, డీజీపీ, లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ, హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు గురువారం వారికి నోటీసులు జారీ చేసింది. హత్రాస్‌కు చెందిన 19 ఏండ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక లైంగికదాడి జరుగగా ఢిల్లీ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తమ అంగీకారం లేకుండానే రాత్రివేళ యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, వారి అనుమతితోనే నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆ యువతిపై లైంగికదాడి జరుగలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులను అధికారులు బెదిరిస్తున్నారు.

ఈ ఘటనపై గురువారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. హత్రాస్‌కు  బయలుదేరిన రాహుల్ గాంధీని పోలీసులు తోసి వేయడంతో పాటు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ హత్రాస్ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపేందుకు నిర్ణయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo