శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 21:45:12

చైనా సైన్యంతో సంబంధం ఉన్న కంపెనీలపై చర్యలకు భారత్‌ రంగం సిద్ధం.!

చైనా సైన్యంతో సంబంధం ఉన్న కంపెనీలపై చర్యలకు భారత్‌ రంగం సిద్ధం.!

న్యూఢిల్లీ : చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో సంబంధాలు ఉన్న 7 చైనా కంపెనీలపై చర్యలకు తీసుకునేందుకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ జాబితాలో హువావెయి, అలీబాబా వంటి గ్లోబల్ జెయింట్ కంపెనీలు ఉన్నాయి.  భారత ప్రభుత్వ పరిశీలనలో ఉన్న చైనా కంపెనీలను ప్రభుత్వం గుర్తించిందని సమాచారం. చైనీస్ టెలికాం కంపెనీ హువావెయి 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలో రూ.12,800 కోట్లు  సంపాదించింది.

ఈ కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ ఝెంగ్‌ఫెయి గతంలో పీఎల్ఏ ఇంజినీరింగ్ కార్ప్స్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ కంపెనీపై బ్రిటన్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో వివాదాలు నడుస్తున్నాయి. పేటీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్, స్నాప్‌డీల్, ఎక్స్‌ప్రెస్‌‌బీస్, ఓలా క్యాబ్స్, ఫ్లిప్‌కార్ట్‌లలో అలీబాబా పెట్టుబడులు ఉన్నాయి. పీఎల్ఏతో సంబంధాలున్న చైనా కంపెనీలు మన దేశంలో అనేక రంగాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, ఉక్కు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉన్న ఈ కంపెనీలు పీఎల్ఏకు సైనిక గూఢచర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గాల్వన్ లోయలో జూన్ 15న భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేయడంతో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఆ వివరాలను చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నడుమ జూన్‌లో 59 చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo