మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 07:10:11

మహోజ్వల ఘట్టానికి కొద్ది గంటల్లో పునాది రాయి..

మహోజ్వల ఘట్టానికి కొద్ది గంటల్లో పునాది రాయి..

అయోధ్య : దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టానికి కొద్ది గంటల్లో పునాది రాయి పడనుంది. రఘురాముడి జన్మస్థలమైన అయోధ్యలో కోట్లాది మంది హిందువుల చిరకాల ఆకాంక్ష సాకారానికి కొద్ది గంటల్లో తొలి అడుగు పడనుంది. భవ్యమైన రామాలయం నిర్మాణానికి ఇవాళ మధ్యాహ్నం శంకుస్థాపన జరుగనుంది. ఈ అపూర్వమైన ఘట్టానికి దేశ ప్రధాని నరేంద్రమోడి హాజరై అంకురార్పణ చేయనున్నారు. అధ్యాత్మిక నగరి అయోధ్య అతిపెద్ద పండుగకు ముస్తాబైంది. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే భూమిపూజ కోసం శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45గంటల మధ్య 32 సెకన్ల పాటు జరుగుతుంది. దివ్యధామం అంకుర్పార్పణకు సంబంధించిన సంప్రదాయ కృతువులన్నీ ఇప్పటికే ప్రారంభం కాగా, వేద పండితుల సమక్షంలో ప్రధాని మోడి తొలి ఇటుక వేయనున్నారు. శంకుస్థాపనలో మొదట నక్షత్రాల్లాంటి ఐదు వెండి ఇటుకలను వేయనున్నారు. అలాగే హరిద్వార్‌ నుంచి తీసుకువచ్చిన గంగా జలాలతో పాటు వేర్వేరు పుణ్య నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు, మట్టిని వినియోగించనున్నారు. భూమిపూజ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పారిజాత మొక్క నాటనున్నారు. అనంతరం శ్రీరామజన్మభూమి మందిర్‌ పేరిట స్టాంపును విడుదల చేస్తారు. 

175 మంది ఆహ్వానితులు

కరోనా మహమ్మారి నేపథ్యంలో భవ్యమైన రామాలయం శంకుస్థాపన కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరు కానున్నారు. కేవలం 175 మందికే శ్రీరామజన్మ భూమి క్షేత్ర ట్రస్టు ఆహ్వానం పంపింది. ఇందులో 135 మంది వివిధ క్షేత్రాలకు చెందిన సాధువులు ఉన్నారు. వేర్వేరు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన ప్రతినిధులున్నారు. అయోధ్య భూవివాదంలో ముస్లింల తరఫున పోరాడిన ఇక్బాల్‌ అన్సారీకి ట్రస్టు తొలి ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం శ్రీరాముడి నిర్ణయం కావచ్చని అన్సారీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేదికపై కొద్ది మంది మాత్రమేలు అతిథులు ఆసీనులు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ మహారాజ్‌, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆసీనులు కానున్నారు. కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనున్నారు.

ప్రధాని షెడ్యూల్‌

అయోధ్య రామాలయం భూమిపూజ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 9.30గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్నవూ చేరుకొని అక్కడి నుంచి అయోధ్యకు చేరుకుంటారు. 11.40గంటలకు హనుమాన్‌ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు భూమిపూజ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటల నుంచి 12.45గంటల మధ్య 32 సెకెన్ల పాటు భూమిపూజ చేస్తారు. కాశీలోని చేనేత కార్మికుడు బచ్చాలాల్‌ మౌర్య రూపొందించిన అంగవస్త్రంతో మహాకృతువులో పాల్గొంటారు. భూమిపూజ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పారిజాత మొక్క నాటనున్నారు. అనంతరం శ్రీరామజన్మభూమి మందిర్‌ పేరిట స్టాంపును విడుదల చేస్తారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo