మంగళవారం 26 జనవరి 2021
National - Dec 02, 2020 , 01:04:47

రైతు నెత్తిన పిడుగే

రైతు నెత్తిన పిడుగే

  • కేంద్ర వ్యవసాయ చట్టాలతో పెనుప్రమాదం
  • 90% రైతులకు ఏ ప్రయోజనమూ ఉండదు
  • మండీలను మూసేయడం మంచిది కాదు
  • బడా రైతులు, మోతుబరులకే మద్దతు ధర
  • ఒప్పంద సేద్యంతో రైతుకూ, భూమికీ ప్రమాదమే 
  • నెట్‌వర్క్‌ ఆఫ్‌ రూరల్‌ అండ్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌లో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ముప్పు తప్పదని ‘స్టేట్‌ ఆఫ్‌ రూరల్‌ అండ్‌ అగ్రేరియన్‌ ఇండియా రిపోర్ట్‌-2020’ హెచ్చరించింది. ఇప్పటికే వ్యవస్థీకృతమైన మార్కెట్ల(మండీ)ను మూసివేయడం ఏ మాత్రం మంచిది కాదని పేర్కొంది. కేంద్రం చెప్తున్నట్టు ఆన్‌లైన్‌ మార్కెట్లో పంట ఉత్పత్తులను అమ్ముకొనే శక్తి దేశంలోని 90 శాతం రైతులకు లేనేలేదని కుండబద్ధలు కొట్టింది. ఈ మేరకు నెట్‌వర్క్‌ ఆఫ్‌ రూరల్‌ అండ్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌ సంస్థ రూపొందించిన నివేదికను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ డీవీ రామ్‌గోపాల్‌రావు విడుదల చేశారు. 

నివేదికలోని ప్రధానాంశాలు

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో పాల్గొనాలంటే పెద్ద మొత్తంలో పంటలు ఉండాలి. కానీ మనదేశంలో 90 శాతం మంది రైతులకు అది సాధ్యం కాదు. ఒప్పంద వ్యవసాయానికి కొత్త చట్టం అనుకూలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపారులు రైతులను గుప్పిట్లో పెట్టుకొని మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలని షరతులు పెడితే మొత్తం వ్యవసాయరంగమే దెబ్బతింటుంది. 

1990-91లో దేశంలో 14.3 కోట్ల హెక్టార్ల భూమి సాగులో ఉండేది. 2014-15 వరకు 30 లక్షల ఎకరాలు తగ్గింది. ఇదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి సుమారు 50 లక్షల ఎకరాలు పెరిగింది. 

రసాయన ఎరువులపై ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తుండటంతో వాటి వాడకం పెరిగి భూమి కలుషితం అవుతున్నది. భూమిలో ఎన్‌పీకే శాతం పెరుగుతున్నది. 

ఒకప్పుడు భారత్‌లో 70 వేలకుపైగా వరి రకాలుండేవి. ఇప్పుడు 7 వేల రకాలకు పడిపోయాయి. 

చిరుధాన్యాల సాగును గోధుమ, వరి, ఇతర వాణిజ్య పంటలు ఆక్రమించాయి. 1970-2010 మధ్య గోధుమ పంట సాగు 47.2% నుంచి 80.3% పెరిగింది. 

దేశంలో 10కోట్ల మంది సరైన నీటి వసతి లేని ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. 54 శాతం సాగుభూవి తీవ్ర నీటి కొరతలో ఉంది. 

2000 సంవత్సరం వరకు ఏటా 80 రోజులు వర్షం పడేది.. ఇప్పుడు 65 రోజులకు పడిపోయింది.  

1951-2011 మధ్య వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య 70 శాతం నుంచి 48 శాతానికి తగ్గింది. 

2013 నాటికి దేశంలో 15.61 కోట్ల కుటుంబాలుంటే ఇందులో 9.02 (57.8 శాతం) కోట్లు వ్యవసాయ కుటుంబాలే. 

వ్యవసాయ కార్మికులు (రైతులు, కూలీలు) 1951 నుంచి 2011 నాటికి భారీగా పెరిగారు. 1951లో 9.72 కోట్లమంది ఉంటే 2011 నాటికి 26.3 కోట్లకు చేరారు. 2001-211 దశాబ్దంలోనే వ్యవసాయ కూలీలు 3.75 కోట్లు పెరిగారు. అదే సమయంలో రైతుల సంఖ్య 85 లక్షలు తగ్గింది. 

2011-16 మధ్య ఏటా 90 లక్షల మంది ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి వలస వెళ్లారు. యూపీ, బీహార్‌ నుంచే ఎక్కువ వలసలు ఉన్నాయి. కరోనా వల్ల 1.06 కోట్ల మంది వలస కార్మికులు స్వరాష్ర్టాలకు వెళ్లిపోయారు. 

2015-16 లెక్కల ప్రకారం ఒక రైతుకు సగటున 1.08 హెక్టార్ల భూమి ఉన్నది. 86 శాతం మంది 2 హెక్టార్ల లోపు మాత్రమే భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులే. 

2015-16 నివేదిక ప్రకారం వార్షికాదాయాలు సన్నకారు రైతులు- రూ.80 వేలు. మధ్యతరగతి రైతులు- రూ.2.01 లక్షలు, పెద్ద రైతు లు- రూ.6.05 లక్షలు. 

2016-17 నాబార్డు సర్వే ప్రకారం రైతు కుటుంబం నెలవారీ సంపాదన రూ.8,931. ఇందులో వ్యవసాయం ద్వారా 35 శాతమే వస్తుండగా మిగతాది ఇతర పనుల ద్వారా లభిస్తున్నది.  

‘రైతు ఆదాయం రెట్టింపు- 2018’ నివేదిక ప్రకారం 52 శాతం వ్యవసాయ కుటుంబాలు ఏదో ఒక రకమైన రుణంలో బందీలుగా ఉన్నాయి. ప్రతి కుటుంబంపై కనీసం రూ.47 వేల రుణం ఉన్నది. 

కొన్నేండ్లుగా నిరుద్యోగిత రేటు పెరుగుతూనే ఉన్నది. సీఎంఐఈ వివరాల ప్రకారం 2017-18లో 4.9 శాతం నిరుద్యోగం ఉన్నది. 

2020 మార్చిలో 7.3 శాతం ఉన్న వ్యవసాయ నిరుద్యోగిత.. మార్చిలో 8.4 శాతానికి పెరిగింది. 2020 ఏప్రిల్‌, మే నెలల్లో భారత్‌లో నిరుద్యోగం తారస్థాయికి చేరింది. 

గ్రామీణుల ఆహారంలో 1983లో తృణధాన్యాల వాటా 23 శాతం ఉంటే 2011 నాటికి 6 శాతానికి తగ్గింది. పట్టణవాసుల్లో ఇది 10 శాతం నుంచి 3 శాతానికి పడిపోయింది. దీంతో 51.4 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.  

వ్యవసాయ పరిశోధనలకు నిధులు తగ్గిపోయాయి.  

పంటల కొనుగోలులో దళారులను నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన మండీలు పెద్ద వ్యాపారుల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఎంఎస్‌పీ అమలు పెద్ద రైతుకే ప్రయోజనకరంగా ఉన్నది. 


logo