మంగళవారం 02 మార్చి 2021
National - Jan 22, 2021 , 18:33:34

అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం: సీరమ్‌ సీఈవో

అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం: సీరమ్‌ సీఈవో

ముంబై: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం జరిగిందని ఆ సంస్థ సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. పూణేలోని మంజరి ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం గురించి వివరించారు. ఈ ప్రమాదం వల్ల కరోనా టీకా కోవిషీల్డ్‌ ఉత్పత్తి, సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. భవిష్యత్తులో ఉత్పత్తి చేసే బీసీజీ టీకా కోసం నిర్మాణం జరుగుతున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన భవనానికి దూరంగా కరోనా టీకా ఉత్పత్తి జరుగుతున్నదని, దీంతో వ్యాక్సిన్లకు ఎలాంటి నష్టం లేదన్నారు. అగ్నిప్రమాదం వల్ల వెయ్యి కోట్లకుపైగా ఆర్థిక నష్టం జరిగిందని అదార్‌ వివరించారు. 

మరోవైపు నిర్లక్ష్యం కారణంగా అగ్నిప్రమాదం జరిగిందా అన్న మీడియా ప్రశ్నకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బదులిచ్చారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని, అది పూర్తయ్యే వరకు ఎలాంటి స్పష్టతకు రాలేమని చెప్పారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని అన్నారు. సీరమ్‌ సంస్థలో మంటలు వ్యాపించినట్లు వార్తలు వచ్చాయని అయితే అదృష్టవశాత్తు కరోనా టీకా తయారీ, నిల్వలు వేరే చోట ఉండటంతో వాటిపై ఎలాంటి ప్రభావం లేదన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo