బుధవారం 08 జూలై 2020
National - Jun 29, 2020 , 13:04:11

స్కూళ్లు తెరు­వ­డంపై.. జూలై 5 తర్వాత నిర్ణ­యిస్తాం

స్కూళ్లు తెరు­వ­డంపై.. జూలై 5 తర్వాత నిర్ణ­యిస్తాం

బెంగ­ళూరు: స్కూళ్లు తెరు­వ­డంపై జూలై 5 తర్వాత నిర్ణయిస్తామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎస్‌ సురేశ్ కుమార్‌ తెలిపారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల నిర్వహణను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి సురేశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కర్ణాటకలో స్కూళ్లను పునరుద్ధరించే అంశంపై ఆయన మాట్లాడారు. ఒకటి నుంచి పదో తరగతి తరగతుల నిర్వహణకు కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. 

ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానంతోపాటు కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించేందుకు నిఫుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సురేశ్ కుమార్‌ చెప్పారు. ఆ కమిటీ నివేదిక అందిన తర్వాత స్కూళ్లు తెరువడంపై ఏం చేయాలన్నది జూలై 5 తర్వాత నిర్ణయిస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లో స్కూళ్లను పునరుద్ధరించాలని తల్లిదండ్రులు కోరుతున్నట్లు  ఆయన చెప్పారు. ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ఉండబోవని మంత్రి స్పష్టం చేశారు. స్కూళ్ల యాజమాన్యాలు వారంలో కనీసం రెండు సార్లు విద్యార్థులతో మాట్లాడాలని ఆయన సూచించారు.  logo