బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 02:50:13

పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు

పంటను ఎక్కడైనా  అమ్ముకోవచ్చు

  • l రైతులు స్వేచ్ఛగా విక్రయాలు జరుపవచ్చు
  • l ప్రైవేట్‌ సంస్థలతోనూ ఒప్పందం చేసుకోవచ్చు
  • l ఈ-ట్రేడింగ్‌కూ అనుమతి.. కేంద్రం రెండు ఆర్డినెన్స్‌లు

న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి కేంద్రం మంగళవారం రెండు కీలక ఆర్డినెన్స్‌లను నోటిఫై చేసింది. మండీలకు (వ్యవసాయ మార్కెట్లకు) వెలుపల ఎలాంటి అవరోధాలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు జరుపుకునేందుకు, పంటకు ముందే దిగుబడుల అమ్మకానికి ప్రైవేట్‌ సంస్థలతో రైతులు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఈ ఆర్డినెన్స్‌లు వీలు కల్పిస్తాయి. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం.. రైతులు తమ రాష్ట్రం లోపల, వెలుపల ఎలాంటి అవరోధాలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, ఫ్యాక్టరీ పరిసరాలు, గోదాములు, శీతల గిడ్డంగులు.. ఇలా ఎక్కడైనా రైతులు పంటను అమ్ముకోవచ్చు. ఆన్‌లైన్‌ మాధ్యమంలోనూ విక్రయాలు జరుపుకోవచ్చు. ప్రైవేట్‌ సంస్థలు, వ్యవసాయ సంఘాలు లేదా అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీలు ఈ మాధ్యమాలను నిర్వహించవచ్చు. అయితే తప్పనిసరిగా ఈ-ట్రేడింగ్‌ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. నిబంధనలను అతిక్రమించినవారికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రైతులతో లావాదేవీలు నిర్వహించే వ్యక్తి అదే రోజున చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితులు తలెత్తితే మూడు రోజుల్లోపు పేమెంట్‌ చేయాలి. వ్యవసాయోత్పత్తుల విక్రయాలకు సంబంధించి రైతులు, వర్తకులు, ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వాలు ఎలాంటి ఫీజు కానీ, సుంకం కానీ విధించడానికి వీల్లేదు. 


logo