శనివారం 28 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 01:28:24

ఈ ఏడాది దేశ వృద్ధి రేటు మైనస్సే

ఈ ఏడాది దేశ వృద్ధి రేటు మైనస్సే

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 27: కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ప్రతికూల (మైనస్‌) స్థాయిలో లేదా దాదాపు సున్నా (శూన్య) స్థాయిలో నమోదు కావచ్చని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా 23.9 శాతం క్షీణించడమే ఇందుకు కారణమన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మెరుగుపడుతుందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అన్‌లాక్‌ ప్రక్రియతో స్థూల ఆర్థిక సూచీలు మెరుగుపడుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుత పండుగల సీజన్‌తో ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్తేజం లభిస్తుందని, దీంతో మిగిలిన రెండు త్రైమాసికాల్లో సానుకూల వృద్ధిరేటు నమోదు కావచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు ప్రజల వ్యయ సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్టు నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

పరోక్షంగా ప్రజలకు నష్టమే

1996 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను భారత్‌ తొలిసారి జీడీపీ గణాంకాలను ప్రకటించింది. అసలు జీడీపీ అంటే ఏమిటో, దాన్ని ఎలా కొలుస్తారో చాలా మందికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. కానీ అదేమీ బ్రహ్మ పదార్థం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొలమానమే జీడీపీ. వినిమయాన్ని, పెట్టుబడులను, ప్రభుత్వ వ్యయాన్ని, నికర ఎగుమతులను దేశ మొత్తం ఆదాయంగా పరిగణించి జీడీపీని లెక్కిస్తారు. జీడీపీ క్షీణతతో సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా నష్టం వాటిల్లదు. అంటే ఉద్యోగాలను కోల్పోవడం, వేతనాలు తగ్గడం లాంటి సమస్యలు ఉండవు. కానీ ఆర్థిక వృద్ధిరేటు ప్రతికూల (మైనస్‌) స్థాయిలోకి వెళ్తే సామాన్య ప్రజలకు పరోక్షంగా చేటు తప్పదు. అదెలాగంటే.. జీడీపీని దేశ జనాభాతో విభజించి తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేసేందుకుతలసరి ఆదాయాన్నే ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటారు. జీడీపీ ప్రతికూల జోన్‌లోకి వెళ్తే తలసరి ఆదాయం తగ్గుతుంది. అంటే ప్రజల జీవన ప్రమాణాలు తగ్గినట్టే.

వివిధ దేశాల 

వృద్ధిరేటు (క్యూ2)

జర్మనీ - 94.26%

అమెరికా -31.4%

జపాన్‌ -7.8%

బ్రిటన్‌ -19.8%

ఫ్రాన్స్‌ - 13.8%