ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 10:54:54

నిరుద్యోగ భృతి నిబంధనలు సడలించే యోచనలో కేంద్రం సర్కారు ?

నిరుద్యోగ భృతి నిబంధనలు సడలించే యోచనలో కేంద్రం సర్కారు ?

ఢిల్లీ : కరోనా సంక్షోభం కారణంగా గత నాలుగు నెలల్లో భారతదేశంలో లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య  మరింతగా పెరిగింది. ప్రస్తుత సమయంలో ఎక్కువమందికి నిరుద్యోగ భృతి కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర సర్కారు సడలించేందుకు సిద్ధమవుతున్నది.కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అతి త్వరలోనే దేశంలోని నిరుద్యోగులకు సాయం అందించే పథకాలలో సవరణలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పథకం కింద నిరుద్యోగ భృతిని పొందుతున్న వారికి చివరిగా డ్రా చేసిన వేతనాలలో 50శాతం వరకు ప్రయోజనాల పరిమాణాన్నిపెంచడం…. అలాగే సహాయక వ్యవధిని ఆరు నెలలకు రెట్టింపు చేయడం వంటి అంశాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నది.

ఈఎస్ఐసీ పథకం వర్తించే కార్మికులకు నిరుద్యోగ బీమాను అందిస్తుంది. ఇప్పటి వరకు రెండేండ్లు పనిచేసిన కార్మికులకు, నెలవారీ జీతంలో 25 శాతం నిరుద్యోగ భృతిగా మూడు నెలల పాటు ఇస్తూ వచ్చింది. అయితే  కొత్త నిబంధనలతో.. ఉద్యోగి పొందిన చివరి నెల జీతంలో 50 శాతం ప్రయోజనం పొందేలా నిబంధనలను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇంకా మద్దతు వ్యవధిని మూడు నుంచి ఆరు నెలల వరకు రెట్టింపు చేయాలని కూడా ఈ ప్రతిపాదనలో పొందుపరిచింది.చందాదారుడు జీవితకాలంలో ఒకసారి మాత్రమే ప్రయోజనం పొందవచ్చు. నిరుద్యోగ భృతి జీవితకాలంలో ఒకసారి మాత్రమే పొందవచ్చని, తద్వారా దాని పదవీకాలాన్ని పెంచుకోవచ్చనే షరతును తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను ఆగస్టు 20 న కార్పొరేషన్ సమావేశానికి ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది.

ఒక వేళ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే, 32 మిలియన్లకు పైగా ఈఎస్ఐసీ చందాదారులకు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగ నష్టాలు సంభవించినప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రస్తుత నిబంధనలలో మార్పుల ఆవశ్యకతను వివరించడంతో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇక అదేవిధంగా ఇతర దేశాలలో నిరుద్యోగ భత్యాల తరహాలో అందరికీ ఉపయోగపడేలా ఒకే పథకాన్ని అమలులో చేసే ప్రక్రియను అనుసరించేలా నిబంధనలు ఉంటే మంచిదని పిఎంఓ భావిస్తున్నది.

'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' మాత్రం దాదాపు 10కోట్ల 20 లక్షల మంది ఏప్రిల్ నెలలో తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు అంచనా వేసింది. ఆ తర్వాత వారికి మరలా పని కల్పించే ప్రక్రియ మే, జూన్ నెలల్లో జరిగినట్లు తెలిపారు. మొత్తం మీద ఈ రెండు నెలలు కలిపి 9 కోట్ల పది లక్షల మంది తిరిగి ఉద్యోగాల్లో చేరగా.. వారిలో ఎక్కువ శాతం మంది జూన్ నెలలోనే మరలా ఉద్యోగంలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే 'అటల్ భీమా వ్యక్తి కళ్యాణ్ యోజన' కింద ఈఎస్ఐసి సబ్స్చ్రైబర్స్ లో.. ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయిన వారికి వారి నెలసరి ఆదాయం లో నుండి 25 శాతం మొత్తాన్ని చెల్లిస్తుండగా దీని నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.


logo