బుధవారం 20 జనవరి 2021
National - Nov 26, 2020 , 19:17:21

డిసెంబర్ 31వ తేదీ వరకు విమాన సర్వీసులు బ్యాన్...

డిసెంబర్ 31వ తేదీ వరకు విమాన సర్వీసులు బ్యాన్...

ఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు విమాన సర్వీసులను బ్యాన్ చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపిక చేసిన విమాన సర్వీసులు మాత్రమే నడవనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తీ తీవ్రత కారణంగా ఈ నిషేధం ఈ ఏడాది చివరి వరకు ఉంటుందని ప్రకటించారు. కార్గో విమానాలకు నిషేధం వర్తించదని తెలిపింది. ఎంపిక చేసిన మార్గాలలో కూడా ప్రతి సందర్భం, పరిస్థితిని పరిశీలించిన అనంతరం విమాన సేవలకు అనుమతిస్తామని డీజీసీఏ తెలిపింది. అంతర్జాతీయ విమానయానం, వీసా నిబంధనలకు సంబంధించి నవంబర్ 30వ తేదీ వరకు ఉన్న నిషేధాన్ని ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీజీసీఏ తెలిపింది.

కోవిడ్ 19 సంబంధిత ట్రావెల్ అండ్ వీసా పరిమితులు పేరుతో డీజీసీఏ విమాన ప్రయాణాలపై కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 అర్దరాత్రి 23.59 వరకు ఈ ఆదేశాలు ఉండనున్నాయి. ఈ పరిమితులు అన్ని కార్గో విమానాలకు, అలాగే, డీజీసీఏ అనుమతించిన మార్గాలకు వర్తించదని పేర్కొంది. కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా మార్చి 23వ తేదీన అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాలకు మే నెల నుండి ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. భారత్‌తో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్న 22 దేశాలకు మాత్రమే ఈ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

భారత్, అమెరికా, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, భూటాన్, కెనడా, ఇథియోపియో, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, మాల్దీవ్స్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, ర్వాండా, టాంజానియా, యూఏఈ, బ్రిటన్, ఉక్రెయిన్ తదితర దేశాలతో బయోబబుల్ ఒప్పందంలో ఉంది. అంటే విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఎయిర్ బబుల్స్‌పైన ఆధారపడాల్సి ఉంటుంది. వందే భారత్ మిషన్ విమానాలు మే నెల నుండి ప్రారంభమయ్యాయి. సెలెక్టడ్ దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం నేపథ్యంలో జూలై నుండి ఈ సర్వీసులు నడుస్తున్నాయి. మహమ్మారి నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. మే 25వ తేదీ నుండి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo