శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 25, 2021 , 08:16:26

15 గంటలపాటు సాగిన భారత్‌-చైనా మిలటరీ చర్చలు

15 గంటలపాటు సాగిన భారత్‌-చైనా మిలటరీ చర్చలు

లఢక్‌: సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా మధ్య జరిగిన తొమ్మిదోవిడుత కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి అధికారుల చర్చలు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిశాయి. తూర్పు లఢక్‌ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తల నివారణకు ఇరుదేశాల కమాండర్‌ స్థాయి అధికారులు నిన్న సమావేశమయ్యారు. చుషుల్ సెక్టార్‌కు సమీపంలోని మోల్డోలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముగిసింది. దాదాపు 15 గంటలపాటు ఈ చర్చలు కొనసాగాయి. అయితే ఈ సందర్భంగా ఇరుదేశాల మిలటరీ అధికారులు ఏయే నిర్ణయాలు తీసుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉన్నది.  

ఈ సమావేశంలో విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి (తూర్పు ఆసియా), లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌ (జీఓసీ 14 కార్ప్స్‌), ఐజీ నార్త్‌ ఫ్రాంటియర్‌ ఐజీ దీపం సేథ్‌, ఐటీబీపీ బ్రిగ్‌ రాజీవ్‌ ఘాయ్‌ (ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌, ఢిల్లీ) మేజర్‌ జనరల్‌ సంజయ్‌ మిత్రా (జీఓసీ 39), మేజర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ రామన్‌, బ్రిగేడియర్‌ హెచ్‌ఎస్‌ గిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

గతేడాది జూన్‌లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందులో భారత్‌కు చెందిన 21 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి ఇరుదేశాల సైనిక అధికారులు ఇప్పటికే ఎనిమిది విడుతలుగా చర్చలు జరిపారు. అయినప్పటికీ సరిహద్దుల్లో బలగాల ఉప సంహరణపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిష్ఠంభన నెలకొంది.   

VIDEOS

logo