మంగళవారం 26 మే 2020
National - May 10, 2020 , 00:38:53

సడలింపులు 3.0 ‘లాక్‌' జాబితా!

సడలింపులు 3.0 ‘లాక్‌' జాబితా!

 • 17తో ముగియనున్న 3వ లాక్‌డౌన్‌ గడువు   
 • సడలింపులకు సిద్ధమవుతున్న కేంద్రం 
 • నిషిద్ధ రంగాల పేర్లు మాత్రమే వెల్లడించే అవకాశం   
 • 15లోగా రాష్ర్టాల అభిప్రాయ సేకరణ 

న్యూఢిల్లీ, మే 9: మూడో విడుత లాక్‌డౌన్‌ ఈ నెల 17తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేత దిశగా కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. గత రెండు విడుతలు ముగిసిన సందర్భంగా ఏప్రిల్‌ 20, మే 4న పలు సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సడలింపులు కాకుండా.. నిషిద్ధ కార్యకలాపాల జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నది. అంటే.. ఆయా రంగాలు, కార్యకలాపాలు తప్ప మిగతావన్నింటినీ అనుమతించనున్నారు. గరిష్ఠంగా ఐదారు రంగాలనే మరికొంత కాలం మూసివేసే అవకాశం ఉన్నదని సమాచారం. ఈ మేరకు కేంద్రం జాబితా తయారుచేసిందని, ఈ నెల 15లోగా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించే అవకాశం ఉన్నదని తెలిసింది. 

సమన్వయ లోపంతో సమస్యలు 

కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రంగాల్లో అమలుచేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్రం భావిస్తున్నది. ‘స్థానిక ప్రభుత్వాల ఆంక్షల వల్ల సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు తెరుచుకోవడం లేదు. దీంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నది. కొన్ని సంస్థలను మూసివేయడం వల్ల ముడి సరుకు దొరుకక, ఉత్పత్తి ఆగిపోతున్నది’ అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. రెడ్‌ జోన్లలో పరిశ్రమలు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నా కార్మికుల కొరత వేధిస్తున్నదని చెప్పారు. 

ప్రజారవాణాకు ప్రత్యేక నిబంధనలు 


మూడో విడుత సడలింపుల్లో భాగంగా ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం, అదే సమయంలో వైరస్‌ విజృంభించకుండా ఉండేందుకు పలు నిబంధనలు రూపొందించాలని కేంద్రం భావిస్తున్నది. ముఖ్యంగా ఈ నెల 17 తర్వాత ప్రజారవాణాను పునరుద్ధరించే అవకాశం ఉన్నది. అయితే నిర్ణీత దూరం, పారిశుధ్యం విషయంలో నిబంధనలు విధించి, కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నది. 

 • బస్సులు, రైళ్లలో నిర్ణీత దూరం పాటించేలా మధ్యలో ఒక సీటును ఖాళీగా ఉంచుతారు. 
 • వాటిని రోజూ కచ్చితంగా రసాయనాలతో కడిగి సూక్ష్మజీవి రహితం చేయాలి. 
 • నిల్చొని ప్రయాణించడంపై పూర్తి నిషేధం. 
 • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 10 మంది కంటే ఎక్కువ గుమికూడరాదు. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. 
 • విమానాల్లో మధ్య సీట్లను తీసివేయాల్సి ఉంటుంది. 
 • ప్రతి ట్రిప్పునకు సూక్ష్మజీవి రహితం చేయాలి. 

 వీటిపై నిషేధం (అంచనా)

 • బహిరంగ సభలు, సమావేశాలు
 • వారాంతపు అంగళ్లు
 • విద్యాసంస్థలు  


కార్యాలయాలు, పరిశ్రమల్లో..  

 • 10 మంది కంటే ఎక్కువ మంది గుమికూడరాదు. 
 • రెండు షిఫ్టుల మధ్య 40 నిమిషాల వ్యవధి ఉండాలి. ఆ సమయంలో కార్యాలయం/పరిశ్రమను రసాయనాలతో శుద్ధి చేయాలి. 
 • ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, బహిరంగ ప్రాంతాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. 


logo