బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 21:52:58

బీజేపీకి విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు : ప్రధాని

బీజేపీకి విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు : ప్రధాని

న్యూఢిల్లీ : బీహార్‌ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడంతో బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇది ప్రజల విజయమని అన్నారు. భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు.

కరోనా సమయంలో ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం మూములు విషయం కాదని, ఎన్నికల కమిషన్‌ భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. కోవిడ్‌ సవాల్‌ను అధిగమించి ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారని గుర్తుచేశారు. ఫలితాల కోసం ప్రజలంతా టీవీలు, సోషల్‌ మీడియాను అంటిపెట్టుకున్నారని చెప్పారు. ప్రజలకు సేవ ఎలా చేయాలో బీజేపీకి తెలుసని అందుకే వారి హృదయాలను గెలుచుకుందని అన్నారు. కరోనా ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటివరకు ఎవరూ కరోనాను పూర్తిగా అంచనా వేయలేకపోయారు.

కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంది. మహిళా ఓటర్లు బీజేపీకి భారీ మద్దతుగా నిలిచారు. భారత మహిళల జీవన ప్రమాణాల మెరుగునకు కృషి చేస్తామని ప్రధాని వెల్లడించారు. కరోనా కష్టకాలంలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. యువత దేశ సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణమని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. పనిచేస్తూ ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారని అన్నారు. విజయోత్సవ సభలో ప్రధాని మోదీతోపాటు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పలువురు బీజేపీ అగ్రనేతలు, పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.