బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 20:17:33

‘కరోనా’ కట్టడికి పాటుపడుతున్న అందరికీ ధన్యవాదాలు..

‘కరోనా’ కట్టడికి పాటుపడుతున్న అందరికీ ధన్యవాదాలు..

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో ‘కరోనా వైరస్‌’(కోవిద్‌-19) కట్టడికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఇవాళ దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూని పాటించారని, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని సీఎం తెలిపారు. ఈ రోజు పాటించినట్లే ప్రజలంతా మరో వారం పాటు స్వీయ నిర్భందం పాటిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టవచ్చని సీఎం వెల్లడించారు. మరో వారం పాటు(మార్చి 31 వరకు) రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించి, కరోనా నివారణకు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు. 

కరోనా నివారణకు అధికారులు, వైద్య సిబ్బంది విశేషంగా కృషి చేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6 కరోనా కేసులు నమోదయ్యాయనీ.. వారిలో ఒకరు పూర్తిగా కోలుకున్నారని సీఎం జగన్‌ తెలిపారు. మిగితా రాష్ర్టాలతో పోల్చుకుంటే ఏపీ సుభీక్షంగా ఉన్నదని సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ర్టానికి విదేశాల నుంచి  వచ్చిన 11,670 మందికి స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించామని తెలిపిన సీఎం.. వారిలో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. 

దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలున్నట్లు తెలిస్తే వెంటనే 104కు ఫోన్‌ చేయాలనీ.. వారు తక్షణమే చర్యలు తీసుకుంటారని సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామనీ.. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లోనూ 200 పడకలతో ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. ప్రతి ఒక్కరు స్వీయ నిర్భందం పాటించాలనీ, సామాజిక దూరం పాటిస్తూ.. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నివారించవచ్చని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.  


logo