శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 14:33:01

అందరిని ఆకర్షిస్తున్న 'కరోనా' వస్ర్తాలయం

అందరిని ఆకర్షిస్తున్న 'కరోనా' వస్ర్తాలయం

అందరి నోట వినిపిస్తున్న మాట ఏంటని ప్రశ్నించుకుంటే.. అది 'కరోనా'నే అని చెప్పొచ్చు. మరి కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సమయంలో కరోనా వస్ర్తాలయం ఏంటని సందేహం రావొచ్చు. ఆ 'కరోనా' వస్ర్తాలయం అందరి దృష్టిని ఆకర్షించడం ఏంటని కూడా ప్రశ్న తలెత్తొచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కేరళకు వెళ్లాల్సిందే. 

కొచ్చికి 40 కిలోమీటర్ల దూరంలో పరీద్‌ అనే యువకుడు కరోనా పేరుతో టెక్స్‌టైల్స్‌ మరియు రెడిమేడ్స్‌ షోరూమ్‌ను ప్రారంభించాడు. ఈ వస్ర్తాలయాన్ని ఇప్పుడు ప్రారంభించ లేదు. గత కొన్నేండ్ల క్రితమే ఈ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు కరోనా వైరస్‌ ఫేమస్‌ కావడంతో.. కాస్త ఆ బట్టల దుకాణంపై అందరి దృష్టి పడింది. ఆ వస్త్ర దుకాణం వద్ద పలువురు ఆగి సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

ఈ సందర్భంగా వస్త్ర దుకాణం యజమాని పరీద్‌ మాట్లాడుతూ.. 'నేను ఇప్పుడు ఇక్కడ ఫేమస్‌ అయ్యాను. నాతో పాటు వస్త్ర దుకాణం ముందు సెల్ఫీ దిగేందుకు పలువురు ఇష్టపడుతున్నారు. కొందరైతే నా దుకాణాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. వాహనాల్లో వెళ్లే వారైతే దుకాణాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిక్షనరీలో ఈ పేరును చూసి ఇష్టపడ్డాను. కరోనా పేరు నచ్చడంతో.. దాన్నే నా షాపుకు నామకరణం చేశాను' అని పరీద్‌ పేర్కొన్నాడు. 

అయితే కరోనా వైరస్‌ తన దుకాణంలోకి ప్రవేశించకుండా పరీద్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. షాపులోకి వచ్చే వారికి శానిటైజర్‌ ఇచ్చి చేతులు శుభ్రం చేసుకొని లోపలికి రావాలని కోరుతున్నాడు.logo