మంగళవారం 31 మార్చి 2020
National - Feb 19, 2020 , 02:44:30

పీవోకేలో ‘ఫుల్లు’గా ఉగ్ర శిబిరాలు

పీవోకేలో ‘ఫుల్లు’గా ఉగ్ర శిబిరాలు
  • భారత్‌లోకి పంపేందుకు పాక్‌ సైన్యం కుయుక్తులు
  • గట్టిగా బుద్ధిచెప్తామన్న భారత ఆర్మీ అధికారి ధిల్లాన్‌

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలన్నీ ముష్కరమూకలతో నిండి ఉన్నాయని సీనియర్‌ ఆర్మీ కమాండర్‌, కశ్మీర్‌లో 15 కార్ప్స్‌ స్ట్రాటజిక్‌ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ కన్వల్‌జీత్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనల మాటున వారిని భారత్‌లోకి పంపేందుకు పాక్‌ సైన్యం చేస్తున్న ప్రయత్నాలకు గట్టిగా జవాబిస్తామని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌లోయలోకి ఉగ్రవాదులను పంపి శాంతిని భగ్నం చేసేందుకు పాక్‌ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కాబోవన్నారు. కశ్మీర్‌లోయలో భద్రతాబలగాలు పౌరసమాజ నాయకులతోపాటు వివిధ భాగస్వాములతో కలిసి శాంతిని పటిష్ఠం చేశాయన్నారు. త్వరలో ఢిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో పోస్టింగ్‌కు వెళ్లనున్న ధిల్లాన్‌ గతేడాది ఫిబ్రవరిలో స్ట్రాటజిక్‌ కమాండ్‌లో చేరారు. ఆ బాధ్యతలు చేపట్టి వారం తిరక్కుండానే గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించడంతో ధిల్లాన్‌కు తొలి నుంచే పెనుసవాళ్లు మొదలయ్యాయి. పీటీఐ వార్తా సంస్థ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ.. భారత్‌పై పాక్‌ కొనసాగిస్తున్న పరోక్ష యుద్ధం గురించి మాట్లాడారు. పాక్‌ మూడు దశాబ్దాల నుంచి భారత్‌లోకి చొరబాట్లను ప్రోత్సహిస్తున్నదన్నారు. ఓవైపు నియంత్రణ రేఖ వెంబడి నిఘాను కొనసాగిస్తూనే మరోవైపు ప్రజలతో స్నేహపూర్వక ధోరణిలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడుతుండటంతో కశ్మీర్‌లోయలో పరిస్థితి మెరుగుపడిందని ధిల్లాన్‌ తెలిపారు.


logo
>>>>>>