ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 15:30:35

‘మోదీజీ వల్లే తేజస్వి పోస్టర్‌లో లాలూ ఫొటో మాయం..’

‘మోదీజీ వల్లే తేజస్వి పోస్టర్‌లో లాలూ ఫొటో మాయం..’

పాట్నా: ఆర్జేడీ పోస్టర్లలో ఆ పార్టీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఫొటో కనిపించడంలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన బెట్టియాలో జరిగిన సభలో ప్రసంగించారు. విపక్షాల మహాకూటమి సీఎం అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్‌ ప్రచార పోస్టర్లలో తన తండ్రి లాలూ ఫొటో లేదన్నారు. మోదీజీ రాజకీయాల గురించి ప్రజలకు తెలుసని, అందుకే తేజస్వి తన తండ్రి లాలు ఫొటోను పోస్టర్ల నుంచి తొలగించారని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. తన పోస్టర్లలో లాలు ఫొటో ఉంచితే బీహార్‌ ప్రజలకు ‘లాంతరు యుగం’ గుర్తుకొస్తుందన్న సంగతి తేజస్వికి బాగా తెలుసని విమర్శించారు. అయితే మోడీజీ ఫొటో ఉన్న పోస్టర్‌ పెట్టుకుని తాను మాట్లాడితే ‘ఎల్‌ఈడీ యుగం’ ప్రజలకు గుర్తుకు వస్తుందని వ్యాఖ్యానించారు. 2014కు ముందు ఎవరూ కూడా ఎన్నికలప్పుడు తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునేవారు కాదని నడ్డా అన్నారు. దీనికి బదులుగా తమ ప్రాంతం, కులం ఆధారంగా ప్రజలను ఓట్లు అడిగేవారిని విమర్శించారు. 2014 నుంచి దేశ రాజకీయ స్వభావాన్ని మోదీ పూర్తిగా మార్చివేశారని జేడీ నడ్డా చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి