ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 19:04:05

లాలూ రికార్డును బ్రేక్‌ చేసిన తేజస్వి

లాలూ రికార్డును బ్రేక్‌ చేసిన తేజస్వి

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ రికార్డును ఆయన కుమారుడు, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ బ్రేక్‌ చేశారు. ఒకే రోజు 19 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. లాలూ ప్రసాద్‌ గతంలో ఒకే రోజు 16 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. అయితే ఆ రికార్డును ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ తాజాగా బ్రేక్‌ చేశారు. శనివారం హెలికాప్టర్‌లో సుడిగాలిలా పర్యటించి 17 ప్రచార సభలకు హాజరయ్యారు. అంతేగాక మరో రెండు బహిరంగ ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. దీంతో మొత్తంగా ఒకే రోజు 19 ఎన్నికల ప్రచార సభల్లో తేజస్వి పాల్గొన్నారు. తన తండ్రి లాలూ కంటే మరో మూడు ప్రచార సభలకు ఆయన హాజరయ్యారు. 


తనకంటూ సొంత ఇమేజ్‌ను సృష్టించుకునేందుకు తేజస్వి తెగ కృషి చేస్తున్నారు. ఆర్జేడీతోపాటు మహాకూటమికి చెందిన కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల అభ్యర్థుల ప్రచార ర్యాలీల్లోనూ  చురుగ్గా పాల్గొంటున్నారు. తండ్రి లాలు అవినీతి ముద్ర తనపై పడకుండా తేజస్వి జాగ్రత్త వహిస్తున్నారు. ప్రచార పోస్టర్లలో తన ఫోటో, పార్టీ గుర్తు మాత్రమే ఉండేలా చూస్తున్నారు. ప్రతి రోజు నాలుగు గంటలకు పైగా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ప్రచార ర్యాలీలకు హాజరవుతున్నారు. రోజుకు సగటున 14 నుంచి 16 ఎన్నికల సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. దీంతో బీజేపీ-జేడీయూ కూటమి ఎన్నికల ప్రచారంలో కాస్త వెనకపడింది. 

మరోవైపు కరోనా నేపథ్యంలో హెలికాప్టర్ల ఫేర్‌ను వాటి సంస్థలు కాస్త తగ్గించాయి. అయినప్పటికీ సింగిల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌కు గంటకు రూ.70 వేల నుంచి రూ.1.25 లక్షలు, డబుల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌కు గంటకు రూ.1.6 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.