బుధవారం 27 జనవరి 2021
National - Jan 14, 2021 , 18:42:22

చైనా, పాక్‌ జేఎఫ్‌-17 కంటే తేజస్‌ మెరుగైనది: ఐఏఎఫ్‌ చీఫ్‌

చైనా, పాక్‌ జేఎఫ్‌-17 కంటే తేజస్‌ మెరుగైనది: ఐఏఎఫ్‌ చీఫ్‌

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌ కలిసి రూపొందించిన జేఎఫ్‌-17 యుద్ధ విమానాల కంటే భారత విమానం తేజస్ చాలా మెరుగైనది, అభివృద్ధి చెందినదని భారత వాయుసేన అధిపతి ఆర్కేఎస్‌ భదౌరియా తెలిపారు. దాడులపరంగా స్టాండ్ఆఫ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. 83 ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాల ఆర్డర్‌కు సీసీఎస్‌ అనుమతి ఇవ్వడంపై గురువారం ఆయన స్పందించారు. తేజస్‌ యుద్ధ విమానాల ప్రవేశం ఐఏఎఫ్‌ సామర్ధ్యాల నిర్మాణానికి భారీ దశ అని తెలిపారు. దేశీయ పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహమని, మన డిజైనర్లకు పెద్ద గుర్తింపు అని అభివర్ణించారు. భారత వైమానిక దళానికి, దేశానికి ఒక భారీ ముందడుగని కొనియాడారు. 

83 తేజస్‌ విమానాల ఆర్డర్ చాలా పెద్దదని భదౌరియా అన్నారు. వీటి ప్రవేశంతో రానున్న 8-9 సంవత్సరాల్లో ఐఏఎఫ్‌ శక్తి, సామర్థ్యాల్లో సమూల మార్పులు జరుగుతాయని తెలిపారు. సైనిక విమానయానంలో ఇవి కీలకంగా ఉంటాయని అన్నారు. దేశీయంగా యుద్ధ విమానాల ఉత్పత్తి, నిర్వహణకు ఊతమిస్తుందని చెప్పారు. 83 తేజస్‌ విమానాలు నాలుగు స్క్వాడ్రన్లను పర్యవేక్షిస్తాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న రెండు స్క్వాడ్రన్ ప్రణాళిక ఆరుకు పెరుగుతుందని చెప్పారు. 

తేజస్‌ యుద్ధ విమానాలను తప్పనిసరిగా సరిహద్దు స్థావరాల్లోనే మోహరిస్తామని భదౌరియా తెలిపారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలున్న బాలాకోట్‌పై వాయు సేన మెరుపుదాడుల సందర్భంగా వినియోగించిన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని తేజస్‌ మించుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo