సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 13:26:54

కిడ్నాప్ నాటక‌మాడి రూ. కోటి డిమాండ్.. యువ‌తి అరెస్టు‌

కిడ్నాప్ నాటక‌మాడి రూ. కోటి డిమాండ్.. యువ‌తి అరెస్టు‌

ల‌క్నో : కిడ్నాప్‌ నాట‌కం ఆడి సొంత‌ త‌ల్లిదండ్రులనే రూ. కోటి డిమాండ్ చేసిన యువ‌తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ర్టం ఎటా జిల్లా నాగ్లా భ‌జ‌నా గ్రామంలో చోటుచేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎటా జిల్లా పోలీసులు 19 ఏళ్ల యువ‌తిని శ‌నివారం నాడు అరెస్టు చేశారు. కిడ్నాప్ అయిన‌ట్లుగా న‌టించి బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి త‌న త‌ల్లిదండ్రుల‌కు కాల్‌చేసి రూ. కోటి డిమాండ్ చేసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. యువ‌తి గురువారం రాత్రి నుంచి క‌నిపించ‌కుండా పోయింది. త‌న ఫోన్ నుండి త‌ల్లిదండ్రుల‌కు కాల్ చేసి కిడ్నాప్‌కు గురైన‌ట్లుగా చెప్పి డ‌బ్బులు డిమాండ్ చేసింది. ఏదిఏమైన‌ప్ప‌టికి యువ‌తిని శ‌నివారం స‌మీపంలోని పొలం నుంచే అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. కాగా ఆమె బాయ్‌ఫ్రెండ్ త‌ప్పించుకు పారిపోయాడన్నారు. 

ఎటా జిల్లా ఎస్పీ రాహుల్ కుమార్ మాట్లాడుతూ... యువ‌తి, యువ‌కుడు ఇరుగుపొరుగువారు. గ‌డిచిన రెండేళ్లుగా రిలేష‌న్‌లో ఉన్నారు. వీరి మ‌ధ్య సంబంధం యువ‌తి త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేదు. ఇటీవ‌లే త‌న కుటుంబం రూ. కోటి పెట్టుబ‌డితో ఓ స్కూల్‌ను ప్రారంభిద్దామ‌నుకున్న విష‌యాన్ని యువ‌తి గ‌మ‌నించింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ఉపాయం ఆలోచించింది. ఆ డ‌బ్బును కొట్టేసి ఇరువురు పారిపోదామ‌నుకున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి కిడ్నాప్‌కు గురైన‌ట్లుగా నాట‌కం ఆడింది. త‌ర‌చుగా త‌ల్లిదండ్రుల‌కు కాల్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేసింది. దీంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశారు. 

ప్రాథ‌మికంగా తాము కూడా ఇది ప్రొఫెష‌న‌ల్ కిడ్నాపింగ్ గ్యాంగ్ ప‌నే అనుకున్న‌ట్లు ఎస్పీ తెలిపారు. బాలిక ఆచూకీని క‌నుగునేందుకు మొత్తం పోలీసు సిబ్బందిని రంగంలోకి దించిన‌ట్లు చెప్పారు. కానీ వ‌రుస‌గా కాల్స్ చేస్తూ బేరాలాడేస‌రికి అనుమానం త‌లెత్తింద‌న్నారు. దీంతో స‌ర్వైలెన్స్ టీంతో యువ‌తి సెల్‌ఫోన్ నెంబ‌ర్‌ను,  ఫోన్‌కాల్స్‌ను ట్రేస్ చేశాం. ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా త‌న ఇంటికి వంద‌ల మీట‌ర్ల దూరంలో ఉండే కాల్స్ చేస్తున్న‌ట్లుగా గ‌మ‌నించినట్లు వెల్ల‌డించారు. విచార‌ణ నిమిత్తం యువ‌తిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. తప్పించుకు పారిపోయిన ఆమె బాయ్‌ఫ్రెండ్ కోసం పోలీసు టీంను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇరువురిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌నున్న‌ట్లు ఎస్పీ పేర్కొన్నారు.  


logo