గురువారం 02 జూలై 2020
National - Feb 04, 2020 , 01:33:51

బెంగాల్‌లో ఉపాధ్యాయురాలిపై టీఎంసీ నేత దాడి

బెంగాల్‌లో ఉపాధ్యాయురాలిపై టీఎంసీ నేత దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ ఉపాధ్యాయురాలిపట్ల అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నేత దారుణంగా ప్రవర్తించాడు. దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లాలోని నందన్‌పూర్‌కు చెందిన స్మృతిఖన్నా దాస్‌ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. బీజేపీ మద్దతురాలైన ఆమెకు చెందిన భూమిని గ్రామ రహదారి కోసం బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ఉప సర్పంచ్‌, టీఎంసీ నేత అమల్‌ సర్కార్‌ ప్రయత్నించాడు. స్మృతిఖన్నా అడ్డుకోబోగా అనుచరులతో కలిసి దాడి చేశాడు. ఆమె కిందపడటంతో కాళ్లు, చేతులను తాళ్లతో కట్టి అందరూ చూస్తుండగా కొడుతూ కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఓ తృణమూల్‌ కార్యకర్త ఇంటిలో ఆమెను నిర్బంధించారు. స్మృతిని కాపాడేందుకు ప్రయత్నించిన సోదరి సోమా, తల్లి, ఇతర కుటుంబసభ్యులపైనా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన స్మృతి స్థానిక దవాఖానలో ప్రాథమిక చికిత్స అనంతరం అమల్‌, అతడి అనుచరులపై గంగారామ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. రాష్ట్రంలోని గూండా పరిపాలనకు ఈ ఘటన నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతన్‌ బసు విమర్శించారు. సీసీఎం నేత సుజన్‌ చక్రవర్తి కూడా ఈ ఘటనను ఖండించారు. కాగా, ఇలాంటి వాటిని తమ పార్టీ సహించబోదని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ తెలిపారు.logo