గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 01:16:12

మద్యం మంట!

మద్యం మంట!

  • ధరల్ని పెంచుతున్న పలు రాష్ర్టాలు
  • యూపీలో రూ. 5 నుంచి రూ. 400 వరకూ పెంపు

చెన్నై/బెంగళూరు/లక్నో: మద్యం ప్రియులకు వివిధ రాష్ర్టాలు షాక్‌ ఇస్తున్నాయి. లాక్‌డౌన్‌ 3.0లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం దుకాణాలు తెరువడానికి అనుమతులిచ్చాయి. అయితే ఇదే సమయంలో మద్యం ధరల్ని భారీగా పెంచుతున్నాయి. ఈ జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఛండీగఢ్‌ తదితర రాష్ర్టాలు ఉన్నాయి. మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయాన్ని గడించడానికి కర్ణాటక ప్రభుత్వం వాటి అమ్మకాలపై ఎక్సైజ్‌ సుంకాన్ని 11% పెంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మద్యం అమ్మకాల ద్వారా రూ. 22,700 కోట్ల ఆదాయం వస్తుందని ఆ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇంకోవైపు, కోరుకున్న వారికి మద్యాన్ని ఇంటికే సరఫరా చేసేలా పంజాబ్‌ ప్రభుత్వం హోమ్‌ డెలివరీ సేవలకు అనుమతులనిచ్చింది. గురువారం నుంచి ప్రారంభంకానున్న ఈ సేవల్లో వినియోగదారుడికి ఒక్కొక్కరికి గరిష్ఠంగా రెండు లీటర్ల మద్యాన్ని సరఫరా చేస్తారు. కాగా, పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం మంగళవారం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా లీటరు పెట్రోలుపై రూ. 2, లీటరు డీజిల్‌పై రూ.1 పెంచింది.logo