బుధవారం 08 జూలై 2020
National - Jan 25, 2020 , 03:09:12

మహారాష్ట్రలో ‘ఫోన్‌ ట్యాపింగ్‌'మంటలు

మహారాష్ట్రలో ‘ఫోన్‌ ట్యాపింగ్‌'మంటలు
  • గత బీజేపీ ప్రభుత్వం ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆరోపించిన హోంమంత్రి
  • ఆరోపణలను తోసిపుచ్చిన మాజీ సీఎం ఫడ్నవీస్‌

ముంబై: మహారాష్ట్రలో ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం తెరపైకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో ప్రస్తుత అధికార ప్రభుత్వం (శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి), బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శుక్రవారం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘గత బీజేపీ సర్కార్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్‌, ఎన్సీపీలకు చెందిన సీనియర్‌ నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ తతంగమంతా నడిచింది.


అప్పట్లో కొందరు అధికారులు ట్యాపింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి ఇజ్రాయెల్‌ వెళ్లారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా కాంగ్రెస్‌, ఎన్సీపీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాను’ అని తెలిపారు. అయితే ఎవరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయన్న విషయాలను మాత్రం మంత్రి వెల్లడించలేదు. మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై గత బీజేపీ ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్‌ స్పందించారు. ఇలాంటి సంస్కృతి రాష్ట్రంలో లేదని, ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేయమని తాము ఆదేశించలేదని చెప్పారు. కావాలనుకుంటే ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరుపుకోవచ్చని సూచించారు.


logo