గురువారం 26 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 16:39:16

విజయ యాత్రను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్‌

విజయ యాత్రను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్‌

చెన్నై: విజయ శూల యాత్రను ప్రారంభించిన బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పార్టీ నాయకులు హెచ్ రాజా, సిటీ రవి, పొన్ రాధాకృష్ణన్‌తోపాటు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నుంచి డిసెంబర్‌ 6 వరకు నెల రోజుల పాటు కుమారస్వామి ఆశీసుల కోసం ‘వెట్రీ వాల్ యాత్ర’ ( విజయ శూల యాత్ర) చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ ఇటీవల తెలిపారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో దీనికి అనుమతించబోమని మద్రాస్‌ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. మరోవైపు తిరువల్లూరు జిల్లాలోని తిరుత్తాని మురుగన్‌ ఆలయం నుంచి ఈ యాత్రను ప్రారంభించి తిరుతానని మురుగన్‌ స్పష్టం చేశారు. ఈ దైవ కార్యక్రమం నిర్వహించడం తన హక్కని చెప్పారు.

శుక్రవారం ఉదయం ఆయన ఆ ఆలయానికి బయలుదేరగా చెన్నై-తిరువల్లూరు సరిహద్దులో బీజేపీ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయానికి వెళ్లేందుకు మురుగన్‌తో పాటు మరికొందరిని మాత్రమే అనుమతించారు. మిగతా పార్టీ కార్యకర్తలను అక్కడే నిలిపివేశారు. మరోవైపు మురుగన్‌ ఆలయానికి చేరిన ఆయన పూజల అనంతరం ‘వెట్రీ వాల్ యాత్ర'ను ప్రారంభించారు. అయితే దీనికి అనుమతి లేకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌తోపాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి వాహనంలో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.