చర్చల్లో ప్రతిష్టంభన

- 8 గంటల పాటు కేంద్ర మంత్రులు, రైతు నాయకుల సమావేశం
- చట్టాల గురించి వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- లోపాలను ఎత్తిచూపిన రైతు సంఘాల ప్రతినిధులు
- కొత్త సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని స్పష్టీకరణ
- రేపు మళ్లీ చర్చలు.. కేంద్రమంత్రి తోమర్
- ప్రభుత్వం ఏర్పాటుచేసిన భోజనం, టీ, మంచినీళ్లను తిరస్కరించిన రైతులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన వీడలేదు. గురువారం ఇక్కడ విజ్ఞాన్ భవన్లో 8 గంటల పాటు కొనసాగిన చర్చలు ఎటువంటి పరిష్కారం కనుగొనకుండానే ముగిశాయి. ‘నల్ల’ చట్టాలుగా అభివర్ణిస్తూ రైతులు వ్యతిరేకిస్తున్న మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని చర్చల సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. కొత్త సాగు చట్టాలపై రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఓపెన్ మైండ్‌తో చర్చిస్తామని కేంద్రం పేర్కొంది. కేంద్రం తరఫున వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ సారథ్యంలో రైల్వేమంత్రి పీయూష్ గోయల్, వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ చర్చల్లో పాల్గొన్నారు. నిరసనోద్యమం కొనసాగిస్తున్న రైతుల తరఫున వివిధ సంఘాలకు చెందిన 40 మంది ప్రతినిధుల బృందం హాజరైంది.
నినాదాలు చేస్తూ బయటకు...
చర్చలు అసంపూర్తిగా ముగిసిన అనంతరం... తోమర్ విలేకరులతో మాట్లాడుతూ తదుపరి సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని తెలిపారు. కొత్త సాగు చట్టాల్లోని ప్రధాన అంశాలపై రైతుల్లో నెలకొన్న ఆందోళనలపై ఎటువంటి భేషజాలు లేకుండా చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన చట్టం విషయంలో రైతుల ఆందోళనలపై కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శనివారం జరిగే చర్చల్లో పరిష్కారం దిశగా పురోగతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు కొత్త సాగు చట్టాల గురించి ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చినప్పటికీ, రైతు నేతలు మాత్రం ఆ చట్టాలను రద్దు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. సమావేశ వేదిక అయిన విజ్ఞాన్ భవన్ నుంచి రైతు నేతలు నినాదాలు చేస్తూ బయటికొచ్చారు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని వారు చెప్పారు. ‘ఈ సమావేశంలోనే పరిష్కారం కనుక్కోకపోతే తదుపరి సమావేశాలకు హాజరయ్యేదిలేదు’ అని వారిలో కొందరు హెచ్చరించారు.
సవరణలు కాదు...రద్దే
‘మేం సవరణలను కోరుకోవడం లేదు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్నదే మా డిమాండ్' అని ఏఐకేసీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి తాము తెలిపిన 8-10 లోపాలను మంత్రులు నోట్ చేసుకున్నారన్నారు. శుక్రవారం 11 గంటలకు అన్ని రైతు సంఘాలు సమావేశమై, శనివారం జరిగే చర్చలకు సంబంధించి సమిష్టి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. అన్ని పాయింట్లను మంత్రులు నోట్ చేసుకున్నారని, వాటిని పరిశీలిస్తామని, ఒక రోజు సమయం కావాలని కోరారని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రిషీపాల్ తెలిపారు. ‘మా తరఫు నుంచి చర్చలు ముగిశాయి. ఈరోజు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే తదుపరి సమావేశాలకు వచ్చేదిలేదని మా నాయకులు చెప్పేశా’రని లోక్ సంఘర్ష్ మర్చా అధ్యక్షురాలు ప్రతిభా షిండే తెలిపారు.
మా భోజనం మేం తెచ్చుకున్నాం
కేంద్రమంత్రులతో చర్చల సందర్భంగా గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని రైతు నాయకులు తిరస్కరించారు. తమ కోసంసింఘు వద్ద నుంచి రైతులు పంపిన భోజనాన్నే వారు ఆరగించారు. కొందరు కింద కూర్చుని తినడం కనిపించింది. భోజనం పెట్టి మంచి ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నించడం కంటే సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని రైతు నాయకులు ప్రభుత్వానికి సూచించారని లోక్ సంఘర్ష్ మోర్చా అధ్యక్షురాలు ప్రతిభా షిండే చెప్పారు. మా తోటి రైతులు రోడ్లపై కూర్చుని నిరసన తెలుపుతుంటే తాము ప్రభుత్వం పెట్టే భోజనాన్ని ఎలా తింటామని ప్రశ్నించారు.
రైతుల సేవలో మెకానిక్ సోదరులు
న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్న రైతులకు పంజాబ్‌కు చెందిన ఇద్దరు సోదరులు తమ వంతు సాయం చేస్తూ సేవా తత్పరతను చాటుకుంటున్నారు. బర్నాలా జిల్లాకు చెందిన రణ్తీర్ సింగ్, ఆయన సోదరుడు జశ్వంత్ సింగ్ వృత్తిరీత్యా మెకానిక్‌లు. సింఘు, టిక్రీ సరిహద్దులకు వచ్చే క్రమంలో ట్రాక్టర్లు చెడిపోయి పలువురు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని వాళ్లు గమనించారు. దీంతో రైతుల ట్రాక్టర్లను ఉచితంగా రిపేర్ చేయడం ప్రారంభించారు. రైతులకు సేవలందిస్తున్న వైద్యుల కార్లను కూడా ఉచితంగానే రిపేర్ చేస్తున్నారు. రైతులకు, వైద్యులకు ఉచితంగా చెరుకు రసాన్ని అందిస్తున్నారు.
ట్రూడోజీ థాంక్స్.. కానీ, ఇది మా అంతర్గత విషయం: రైతు నేత
న్యూఢిల్లీ: రైతులు చేపడుతున్న నిరసనలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు తెలుపడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇది భారత్ అంతర్గత వ్యవహారమని, ఇతరుల జోక్యం ఇందులో తగదని ఇప్పటికే కేంద్రం ఘాటుగా స్పందించింది. తాజాగా, ఓ రైతు నాయకుడు కూడా ట్రూడో వ్యాఖ్యలపై స్పందించారు. ‘మా నిరసనలు దేశ అంతర్గత విషయానికి సంబంధించినవి. ఇందులో బయటి వ్యక్తుల జోక్యాన్ని సహించబోం. రైతులపై మీరు (ట్రూడో) చూపుతున్న సానుభూతికి కృతజ్ఞతలు’ అని శివ్ కుమార్ కక్కాజీ అనే రైతు నాయకుడు తెలిపారు.
తాజావార్తలు
- కాచిగూడ-యలహంక ప్రత్యేక రైలు
- బ్రాహ్మణుల కోసం అపరకర్మల భవనం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
- ఓటీపీ వచ్చిందా.. రేషన్ తీసుకో..!
- వైభవంగా పెద జీయర్ స్వామి పరమ పదోత్సవం
- నిఘా కన్ను ఛేదనలో దన్ను
- పేదల సంక్షేమం కోసమే..
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు