బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 16:57:20

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి : ఉపరాష్ట్రపతి

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు, పార్లమెంట్ సభ్యులు ఆరోగ్య సంరక్షణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. ఈ మహమ్మారి విషయంలో పార్లమెంట్ తీసుకుంటున్న చర్యలు, ఏర్పాటు చేసిన సౌకర్యాలను పునరుద్ఘాటించిన వెంకయ్య నాయుడు.. రాపిడ్ యాంటిజెన్, ఆర్టీ-పీసీఆర్ రెండు పరీక్షా సౌకర్యాలు పార్లమెంట్ లోని రిసెప్షన్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం గం. 2.30 నిముషాల వరకూ, అదేవిధంగా పార్లమెంట్ అనెక్సీలో ఉదయం గం.10-30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. సభ్యులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇవేగాక గణనీయమైన సంఖ్యలో ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ సహిత ప్రథమ చికిత్స పార్లమెంట్ తో పాటు పార్లమెంట్ అనెక్సీ వైద్య కేంద్రం వద్ద లభిస్తాయని తెలిపారు. సభ్యుల భద్రత కోసం ఐసీఎంఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించే విషయంలో సభ్యులందరూ సహకరించాలని కోరిన ఆయన, సమయం కొరత దృష్ట్యా అర్థవంతంగా వినియోగించుకోవాలని, సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని గౌరవ సభ్యులకు సూచించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి హోం శాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, ఐసీఎంఆర్ ప్రధాన సంచాలకులు (డీజీ), రాజ్యసభ సచివాలయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు సభ్యులకు తెలియజేశారు. ఈ మహమ్మారితో పోరాడటంలో భాగంగా సభ్యులు తీసుకోవలసిన నాలుగు కీలకమైన చర్యలను వెంకయ్య నాయుడు ప్రధానంగా ప్రస్తావించారు. బయటి వారిని కలిసేటప్పుడు మాస్క్ ధరించడం అత్యంత ఆవశ్యకమని సూచించారు. మీ దగ్గర పని చేసేవారు సైతం బయట నుంచి వచ్చి విధులను నిర్వహిస్తుంటే వారు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. అలాగే, సురక్షితమైన దూరాన్ని పాటించడం రెండో అతిముఖ్యమైన జాగ్రత్త అని తెలిపిన ఆయన, ఈ మహమ్మారి దూరమయ్యే వరకూ సురక్షిత దూరం విషయంలో రాజీపడొద్దని సూచించారు. మూడో జాగ్రత్తగా వ్యక్తిగత పరిశుభ్రతను ప్రస్తావించి, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రపరచుకోవడం వల్ల ఇతర ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, మంచి పోషకాలున్న బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా రోజూ నడక వంటి కనీస వ్యాయామాలైనా తప్పనిసరిగా చేయాలని సూచించారు.


logo