మంగళవారం 31 మార్చి 2020
National - Feb 25, 2020 , 04:12:08

నమస్తే భారత్‌

నమస్తే భారత్‌
 • భారత్‌కు నమ్మకమైన మిత్రుడిగా ఉంటాం
 • 70 ఏండ్లలో భారత్‌ దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది
 • సర్వసమానత్వ సూత్రాన్ని పాటిస్తున్నది
 • నిమిషానికి 12మందిని పేదరికంనుంచి బయటపడేసింది
 • భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసల జల్లు
 • ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం
 • భారత్‌కు ట్రంప్‌ ప్రత్యేక మిత్రుడన్న ప్రధాని మోదీ
 • తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్‌ కుటుంబం
 • నేడు హైదరాబాద్‌ హౌస్‌లో ఇరు దేశాధినేతల సమావేశం
 • రక్షణరంగంలో 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందం
 • ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై ఉక్కుసంకల్పంతో పోరాడుతాం

‘భారతదేశం స్వేచ్ఛకు, హక్కులకు, చట్టాలకు గౌరవం ఇస్తుంది. ఇక్కడ హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, యూదులు సామరస్యంగా తమ సంప్రదాయాలను పాటిస్తుంటారు. అందుకే భారత్‌ను ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్నది’ అంటూ అగ్రరాజ్యాధీశుడు డొనాల్డ్‌ట్రంప్‌.. అహ్మదాబాద్‌ వేదికగా లక్షమందికిపైగా జనం సమక్షంలో చాటిచెప్పారు. ఉగ్రవాదానికి రెండు దేశాలూ నష్టపోయాయని ప్రస్తావిస్తూ.. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై అమెరికా-భారత్‌ ఉక్కుసంకల్పంతో పోరాడుతాయని స్పష్టంచేశారు. సోమవారం భారత పర్యటనను ప్రారంభించిన ట్రంప్‌కు అహ్మదాబాద్‌లో అఖండ స్వాగతం లభించింది. అనంతరం ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతెరా స్టేడియంలో మోదీ, ట్రంప్‌ లక్షమందికిపైగా జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం భారత్‌ సాధించిన అభివృద్ధి అపూర్వమని ట్రంప్‌ కొనియాడారు. ట్రంప్‌ రాక ఇరుదేశాల సంబంధాల్లో కొత్త చరిత్రను లిఖించిందని మోదీ చెప్పారు. అనంతరం ట్రంప్‌ కుటుంబం తాజ్‌మహల్‌ను సందర్శించి ఢిల్లీ చేరుకొన్నది. మంగళవారం మోదీ, ట్రంప్‌ హైదరాబాద్‌హౌస్‌లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా 300 కోట్ల డాలర్ల విలువైన ఆధునిక సైనిక హెలికాప్టర్లు, సైనిక సామగ్రిని భారత్‌కు అమెరికా అందజేసే ఒప్పందంపై సంతకాలు జరుగనున్నాయి.

అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 24: ‘అద్భుతమైన దేశంలో.. అత్యద్భుత స్వాగతం లభించింది’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోమవారం అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో ట్రంప్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. స్వాతంత్య్రం అనంతరం భారతదేశ ప్రస్థానం అత్యద్భుతమని కొనియాడారు. దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, పేదరికంపై చిరస్మరణీయ విజయం సాధించిందని పేర్కొన్నారు. భారత్‌ సర్వసమానత్వ సూత్రాన్ని పాటిస్తున్నదని అభినందించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య మంగళవారం మూడు బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదురనున్నట్టు చెప్పారు. 

మనది సహజమైన స్నేహం

‘నమస్తే..’ అంటూ ట్రంప్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత్‌కు రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తమకు అద్భుతమైన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐదు నెలల కిందట ప్రధాని మోదీకి అమెరికాలోని అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియంలో స్వాగతం పలికితే.. ఇప్పుడు తనను ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియానికి ఆహ్వానించారని హర్షం వ్యక్తం చేశారు. నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి హాజరైన 1.25లక్షలమంది భారతదేశ సంస్కృతికి, భారతీయుల విశాలహృదయానికి నిదర్శనంగా నిలుస్తున్నారని కొనియాడారు. అద్భుతమైన దేశంలో అత్యద్భుతమైన స్వాగతం లభించిందంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘భారత్‌-అమెరికా మధ్య సహజమైన శాశ్వతమైన స్నేహం ఉన్నది’ అని ట్రంప్‌ చెప్పగానే.. స్టేడియంలో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి.


70 ఏండ్లలో అద్భుతమైన ప్రస్థానం 

స్వాతంత్య్రానంతరం భారతదేశ ప్రస్థానం అత్యద్భుతమని ట్రంప్‌ ప్రశంసించారు. ‘భారత్‌ 70 ఏండ్లలోనే దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా.. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా, ప్రపంచంలోని అద్భుతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగింది’ అని కొనియాడారు. 7 దశాబ్దాల్లోనే భారత ఆర్థిక వ్యవస్థ 6రెట్లు పెరిగిందన్నారు. గత పదేండ్లలోనే 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని ప్రశంసించారు. 
భారత్‌లో సర్వ సమానత్వం 

భారత్‌ సర్వసమానత్వ సూత్రాన్ని పాటిస్తున్నదని ట్రంప్‌ అభినందించారు. భారత్‌లో వందకుపైగా భాషలు మాట్లాడుతారని, పదుల సంఖ్యలో రాష్ర్టాలు ఉన్నాయని, అయినా జాతీయ భావనతో అందరూ ఐకమత్యంగా ఉంటారని, ఇది ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. అమెరికాలో 40 లక్షలమందికిపైగా భారతీయులు నివసిస్తున్నారని, వారంతా అద్భుతమైన వ్యక్తులని కొనియాడారు.

 

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు 

ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి దేశ ప్రజలను కాపాడటంపై భారత్‌-అమెరికా ఉక్కు సంకల్పంతో ఉన్నాయన్న ట్రంప్‌, రెండూ ఉగ్రవాద బాధిత దేశాలేనని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరుకు భారత్‌, అమెరికా సమిష్టిగా పనిచేస్తున్నాయని చెప్పారు. పాకిస్థాన్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, ఫలితంగానే ఆ దేశం ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పురోగతి సాధించిందని చెప్పారు.అమెరికా-భారత్‌ మధ్య మంగళవారం 3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.21.6 వేల కోట్లు) విలువైన ఒప్పందం కుదురబోతున్నదని ట్రంప్‌ ప్రకటించారు.


మోదీ.. విజయానికి నిలువెత్తు నిదర్శనం 

భారతీయులు నిరంతర శ్రమతో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని, ఇందుకు ప్రధాని మోదీయే నిదర్శనమని ట్రంప్‌ కొనియాడారు. మోదీ ఇదే నగరంలో (అహ్మదాబాద్‌) చాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన మోదీకి అభినందనలు తెలియజేశారు. స్వతంత్ర భారత చరిత్రలో మోదీని అద్భుతమైన, విజయవంతమైన నేతగా కొనియాడారు. తనకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడని చెప్పారు. దీంతో స్టేడియం ‘మోదీ.. మోదీ’ నినాదాలతో హోరెత్తింది. చివరగా ‘గాడ్‌ బ్లెస్‌ ఇండియా.. గాడ్‌ బ్లెస్‌ అమెరికా’అంటూ ట్రంప్‌ ప్రసంగం ముగించారు. 


ట్రంప్‌ నోట హైదరాబాద్‌ మాట

 • ట్రంప్‌ తన ప్రసంగంలో హైదరాబాద్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండేండ్ల కిందట తన కుమార్తె హైదరాబాద్‌లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రెండేండ్ల కిందట హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు నా కూతురు ఇవాంక హాజరైంది. అప్పుడు ప్రధాని మోదీ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఇవాంక మళ్లీ ఇప్పుడు మాతో వచ్చింది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. మహిళలు వ్యాపారరంగంలో రాణిస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు. ‘పురుషులూ జర జాగ్రత్తగా ఉండండి’ అంటూ సలహా ఇచ్చారు. 
 • ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బాంగ్రా నృత్యాన్ని, దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే, షోలే వంటి క్లాసిక్‌ సినిమాల్లోని నృత్యాలు, డ్రామాను ఆస్వాదిస్తున్నారు. బాలీవుడ్‌ ఏటా రెండువేల సినిమాలను అందిస్తున్నది. ఇవి భారతీయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. 
 • భారత్‌ సచిన్‌, కోహ్లీ వంటి గొప్ప క్రీడాకారులను అందించింది. 
 • స్వామి వివేకానంద బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయం. 
 • అంతరిక్ష రంగంలో భారత్‌, అమెరికా మైత్రి కొనసాగుతుంది. 
 • ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి దేశ ప్రజలను కాపాడటంపై భారత్‌-అమెరికా ఉక్కు సంకల్పంతో ఉన్నాయి.
 • రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే.ఉగ్రవాదంపై రాజీలేని పోరుకు భారత్‌, అమెరికా సమిష్టిగా పనిచేస్తున్నాయి.
 • ప్రజలను పీడించి ఎదిగిన దేశానికి.. ప్రజలకు స్వేచ్ఛనిస్తూ, వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ ఎదిగిన దేశానికి మధ్య తేడా ఉంటుంది. ఇందులో భారత్‌ రెండో రకం.
 • చెడుపై మంచికి గెలుపునకు సూచికగాదీపావళి రోజు లక్షలాది మంది దీపాలు వెలిగించి సంబురాలు చేసుకుంటారు. త్వరలో అన్ని మతాలవారు కలిసి హోళీ జరుపుకోనున్నారు. ఇదీ భారత్‌ వైవిధ్యత.
 • మోదీ గుజరాత్‌కు మాత్రమే గౌరవం కాదు. భారతీయుల శ్రమతత్వానికి, వారు ఏదైనా సాధించగలరనేదానికి నిలువెత్తు నిదర్శనం.


నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి రాష్ట్రపతిభవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి ఇస్తున్న ప్రత్యేక విందులో ఆయన పాల్గొంటారు. విందుకు హాజరవ్వాల్సిందిగా కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానాలు అందాయి. కేసీఆర్‌ తిరిగి బుధవారం హైదరాబాద్‌ రానున్నారు.


 • అమెరికా.. భారత్‌ను ప్రేమిస్తుంది.. గౌరవిస్తుంది. అమెరికా ఎల్లప్పుడూ భారత్‌కు, భారతీయులకు నమ్మకమైన స్నేహితుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఇవ్వడానికే నేను, నా భార్య మెలానియా ఎనిమిది వేల మైళ్లు ప్రయాణించి
 • ఇక్కడికి వచ్చాం. అద్భుతమైన దేశంలో.. అత్యద్భుత స్వాగతం లభించింది.      

- ట్రంప్‌


 • రెండేండ్ల కిందట హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు నా కూతురు ఇవాంక హాజరైంది. అప్పుడు ప్రధాని మోదీ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఇవాంక మళ్లీ ఇప్పుడు మాతో వచ్చింది.

- ట్రంప్‌


logo
>>>>>>