సోమవారం 30 నవంబర్ 2020
National - Sep 22, 2020 , 17:05:48

అల్ల‌ర్ల‌కు ముందు రూ. కోటి అందుకున్న తాహిర్ హుస్సేన్‌, ఇష్ర‌త్ జ‌హాన్‌

అల్ల‌ర్ల‌కు ముందు రూ. కోటి అందుకున్న తాహిర్ హుస్సేన్‌, ఇష్ర‌త్ జ‌హాన్‌

ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్ల‌ర్ల‌పై స్పెష‌ల్ సెల్ తాజా చార్జిషీట్ దాఖ‌లు చేసింది. నిందితులు తాహిర్ హుస్సేన్, ఇష్రత్ జహాన్, ఖలీద్ సైఫీ, షాఫా-ఉర్-రెహ్మాన్, మీరన్ హైదర్ లు బ్యాంక్ ఖాతా ద్వారా లేదా నగదు రూపంలో డిసెంబర్ 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు రూ. కోటికి పైగా న‌గ‌దును అందుకున్న‌ట్లు తెలిపారు. కేసు ద‌ర్యాప్తులో భాగంగా 1 డిసెంబర్ 2019 నుండి 26 ఫిబ్రవరి, 2020 మధ్య కాలంలో నిందితులు రూ .1, 61, 33, 703 అందుకున్న‌ట్లు వెల్లడించారు. మొత్తం రూ .1.61 కోట్లలో 1,48,01,186 రూపాయలను డ్రా చేసి దేశ రాజధానిలో అల్లర్ల కుట్రను అమలు చేయడానికి నిరసన ప్ర‌దేశాల్లో నిర్వహణకు ఖర్చు చేసిన‌ట్లుగా తెలిపారు. నిందితులు మోసపూరిత లావాదేవీలను ఎలా నిర్వహించారో స్పెష‌ల్ సెల్‌ చార్జిషీట్‌లో పేర్కొంది. ఇష్రత్ జహాన్ బావమరిది ఇమ్రాన్ తన వ్యాపారం కోసం ఆమె నుండి రూ .4 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ న‌గ‌దుకు సంబంధించి ఐటీ రిట‌ర్న్‌లో ప్రస్తావించ‌లేదన్నారు. స‌ద‌రు న‌గ‌దు వినియోగానికి సంబంధించి సమాధానం ఇవ్వడంలో కూడా ఆయన విఫలమయ్యారని పోలీసులు తెలిపారు.