గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 00:55:29

పనికిమాలిన పైలట్‌

పనికిమాలిన పైలట్‌

  • అతనికి ఏ సామర్థ్యమూ లేదు.. వాక్చాతుర్యమే బలమనుకుంటాడు
  • ఆరునెలలుగా బీజేపీతో కలిసి కుట్ర.. పైలట్‌పై అశోక్‌గెహ్లాట్‌ ధ్వజం
  • బీజేపీలోకి వస్తే 35కోట్లు ఇస్తానన్నాడు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆరోపణ

జైపూర్‌, జూలై 20: తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సచిన్‌ పైలట్‌ బీజేపీతో కలిసి 6 నెలలుగా కుట్ర పన్నుతున్నారని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి తోడు.. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వస్తే రూ.35కోట్లు ఇస్తానని పైలట్‌ తనకు ఆఫర్‌ ఇచ్చినట్టు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్‌ మలింగా బాంబుపేల్చారు. కాగా, రాష్ట్రంలో కేసుల విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి గెహ్లాట్‌ ప్రభుత్వం సాధారణ అనుమతులు రద్దుచేసింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టిన ఆడియో రికార్డింగుల ప్రామాణికతను తేల్చాల్సిందేనని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ డిమాండ్‌చేశారు. సోమవారం గెహ్లాట్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏడేండ్లపాటు పైలట్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు డిఫ్యూటీ సీఎంగా, పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇచ్చింది. చాలా చిన్నవయసులోనే ఎంపీగా, కేంద్రమంత్రిగా చేసింది. కానీ, ఆయన మాత్రం గత ఆరు నెలలుగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు. ఆయన హిందీ, ఇంగ్లీష్‌ బాగా మాట్లాడి ఆకట్టుకోగలడు. కానీ అతడు పనికిమాలివాడని, శక్తిహీనుడని మాకు తెలుసు’ అని అన్నారు. ‘పైలట్‌కోసం హరీశ్‌సాల్వే, ముఖుల్‌ రోహత్గీ కోర్టులో వాదిస్తున్నారు. సాల్వే ఎవరి మనిషో అందరికీ తెలుసు. వారికి ఫీజులు ఎవరు చెల్లిస్తున్నారు? హర్యానాలో పైలట్‌ వర్గం ఎమ్మెల్యేల హోటల్‌ బిల్లులు ఎవరు చెల్లిస్తారు?’ అని పరోక్షంగా బీజేపీపై ధ్వజమెత్తారు. గిరిరాజ్‌సింగ్‌ మలింగా ఆరోపణలపై సచిన్‌పైలట్‌ తీవ్రంగా స్పందించారు. ఆయనపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కాగా, స్పీకర్‌ జారీచేసిన అనర్హత నోటీసులను కొట్టివేయాలన్న పైలట్‌ పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు విచారణ జరిపింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఇప్పటికీ చర్యలు తీసుకోనందున ఈ పిటిషన్లకు అర్థమే లేదని స్పీకర్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి వాదించారు. కోర్టు  విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలకోసం ఎస్‌వోజీ పోలీసులు వేట ముమ్మరం చేశారు. హర్యానాలోని మనేసర్‌ రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు 3 రోజుల్లో తమముందు హాజరుకావాలని అల్టిమేటం జారీచేశారు. 

డబ్బుతో కూల్చుతారా?

రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాన్ని డబ్బు మూటలతో కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. సచిన్‌పైలట్‌పై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.  


logo