సోమవారం 25 మే 2020
National - Apr 04, 2020 , 11:02:13

స్వీపర్‌కు పోలీసుల గౌరవ వందనం

స్వీపర్‌కు పోలీసుల గౌరవ వందనం

తిరువనంతపురం : అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి పోలీసుల గౌరవ వందనం చూశాం. కానీ ఓ స్వీపర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. స్వీపర్‌కు గౌరవ వందనం ఏంటని అనుకుంటున్నారా? ఆ స్వీపర్‌ చిత్తశుద్ధి, పనితనం మెచ్చి ఆమెకు పోలీసులు గౌరవ వందనం చేశారు. 

త్రిశూరు జిల్లాలోని ముప్లియమ్‌కు చెందిన రాధ.. స్థానిక పోలీసు స్టేషన్‌లో గత 30 ఏళ్ల నుంచి స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఏడాది మార్చి 31న ఆమె పదవీవిరమణ చేశారు. రిటైర్‌మెంట్‌ రోజున కూడా ఎప్పటిలాగే విధులకు వచ్చింది. పోలీసు స్టేషన్‌ను అంతా క్లీన్‌ చేసింది రాధ. ఆ తర్వాత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఎస్‌. జయక్రిష్ణన్‌, ఎస్‌ఐ చిత్తరంజన్‌ కలిసి ఆమెకు మెమెంటోను ప్రదానం చేశారు. అనంతరం రాధకు పోలీసులు గౌరవ వందనం చేశారు.

అయితే లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు.. ఆమెకు వీడ్కోలు ఏర్పాట్లు ఘనంగా చేయలేకపోయారు. అయినప్పటికీ ఆమె పట్ల పోలీసులకున్న అభిమానం.. గౌరవ వందనం చేసేలా చేసింది. కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా సెలవులు తీసుకోవాలని పోలీసులు సూచించినప్పటికీ ఆమె సెలవులు తీసుకోలేదు. తన సర్వీస్‌ చివరి రోజు వరకు కూడా చిత్తశుద్ధితో పని చేసింది రాధ. 1960లో రాధ పదో తరగతి పాస్‌ అయింది. 1990లో స్వీపర్‌గా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరింది. 


logo