ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 19, 2020 , 21:39:14

బంగారం అక్రమ రవాణా నిందితురాలు మా కుటుంబ స్నేహితురాలే : ఐఏఎస్‌ శివశంకర్‌

బంగారం అక్రమ రవాణా నిందితురాలు మా కుటుంబ స్నేహితురాలే : ఐఏఎస్‌ శివశంకర్‌

తిరువనంతపురం: సంచలనం సృష్టించిన కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్‌ పలు విషయాలను ఈడీ ఎదుట వెల్లడించారు. బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ తన కుటుంబ స్నేహితురాలు అని అంగీకరించారు. రాష్ట్ర పరిపాలన, యూఏఈ కాన్సులేట్‌ మధ్య సంబంధాలు నెరిపేందుకు తనను ముఖ్యమంత్రి  పినరాయి విజయన్‌ అధికారం ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఎదుట శివశంకర్ ఒప్పుకొన్నట్లు తెలిసింది.

ఈడీ ఎదుట ఆయన ఒప్పుకున్న వివరాల ప్రకారం.. శివశంకర్ యూఏఈ కాన్సులేట్-కేరళ ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. స్వప్నా సురేష్ తన కుటుంబ స్నేహితురాలని ఒప్పుకున్నాడు. ప్రభుత్వ ప్రాజెక్ట్ కోసం తానే ఆమెను సూచించినట్లు తెలిపాడు. స్వప్పా సురేష్ ఈజిప్ట్‌ నుంచి నగదు పొందారని, తన చార్టర్డ్ అకౌంటెంట్‌తో ఆమెను సంప్రదించేలా చేశానని దర్యాప్తు అధికారుల ముందు తెలిపాడు. 

సురేష్, సందీప్ నాయర్లతో పరిచయం గురించి ఈడీ ప్రశ్నించగా.. 2017 నుంచి కాన్సులేట్ జనరల్ కార్యదర్శిగా స్వప్పా సురేష్ తనకు పరిచయం అని చెప్పారు. తదనంతర కాలంలో ఆమె తన కుటుంబ స్నేహితురాలు అయ్యిందని, ఆమె తల్లిదండ్రులు, భర్త బాగా తెలుసునని పేర్కొన్నారు. నాయర్‌ను 3-4 సార్లు స్వప్నా సురేష్ సమక్షంలో కలిశానని కూడా చెప్పారు.

కాగా, సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో తమ ప్రభుత్వం ప్రమేయం లేదని పునరుద్ఘాటించారు. శివశంకర్‌ను రక్షించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. బంగారు అక్రమ రవాణా నిందితులతో సంబంధాలు బయటకు వచ్చిన వెంటనే అతడిని ప్రిన్సిపల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించానన్నారు. ఇప్పుడు, అతడికి సీఎంఓతో ఎటువంటి సంబంధం లేనందున దర్యాప్తు సంస్థలు వారి దర్యాప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవచ్చు అని పేర్కొన్నారు. కాగా, సస్పెన్షన్‌కు గురైన శివశంకర్‌కు భారీ ఊరట లభించింది. సీనియర్ ఐఏఎస్ అధికారిని అక్టోబర్ 23వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని కస్టమ్స్‌కు కేరళ హైకోర్టు ఆదేశించింది. శివశంకర్‌ను అక్టోబర్ 23 వరకు అరెస్టు చేయమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు గత వారం కూడా హైకోర్టు ఆదేశించింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.