సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 18:33:08

పూరీ ఆలయాన్ని సందర్శించిన స్వాత్మానందేంద్ర

పూరీ ఆలయాన్ని సందర్శించిన స్వాత్మానందేంద్ర

భువ‌నేశ్వ‌ర్ : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర ఒడిశా యాత్ర కొనసాగుతోంది. శనివారం పూరీ పట్టణంలో పర్యటించారు. సూర్యోదయ వేళ పూరీ సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ పుణ్యస్నానం చేసి జపమాచరించారు. శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ అద్వైత సిద్ధాంతంపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత పూరీ పట్టణంలోని పపూడియా మఠాన్ని సందర్శించారు. రామానంద సంప్రదాయాన్ని అనుసరిస్తున్న పపూడియా మఠం విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అక్కడే పలువురు మండలేశ్వర్లు (స్వాములు) స్వాత్మానందేంద్రను కలిసారు. హిందూ ధర్మ ప్రచారంపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో హైందవ ధర్మ వ్యాప్తికి జరుగుతున్న కృషిని స్వామి స్వాత్మానందేంద్ర మండలేశ్వరులకు వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠం జాతీయ స్థాయిలో పీఠాధిపతుల సమ్మేళనం తలపెట్టబోతోందని ఈ సందర్భంగా ప్రకటించారు. 

ఈ సందర్భంగా పపూడియా మఠం మహా మండలేశ్వర్ రామకృష్ణ దాస్ మహరాజ్ రామానంద సంప్రదాయం ప్రకారం స్వామీజీని మఠంలోనికి ఆహ్వానించారు. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ ఆలయాన్ని స్వామీజీ సందర్శించారు. ఒడిశా ప్రభుత్వం  కోవిడ్ ఆంక్షలను కొనసాగిస్తుండటంతో ఆలయాన్ని మూసివేసారు. దీంతో ఆలయం వెలుపల నుంచి పతితపావన దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో స్వామి స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ భక్తుల దర్శనార్థం పూరీ ఆలయాన్ని తెరవాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. భక్తులంతా పూరీ జగన్నాధుని ఆలయాన్ని ముక్తిక్షేత్రంగా భావిస్తారని, కార్తీకమాసం సమీపిస్తున్నందున ఆలయాన్ని తెరిచే విషయంలో తక్షణ నిర్ణయం అవసరమని సూచించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఆలయాల్లోనికి భక్తులను ఇప్పటికే అనుమతిస్తున్న విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుచేశారు. ఆలయ ప్రధానార్చకులు జనార్ధన్ పట్టాజోషి మహాపాత్రో స్వాత్మానందేంద్రకు జగన్నాధుని శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేసారు