మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 11:55:46

మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సుస్థిర విధానం

మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సుస్థిర విధానం

 ఢిల్లీ : దేశంలో  పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పట్టణీకరణ ప్రక్రియ కారణంగా క్రమంగా పేరుకుపోతున్న చెత్తను, ఘన వ్యర్థాలను నిర్మూలించే ప్రక్రియ ఇపుడు దేశానికి భారీ సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6.2కోట్ల టన్నులుగా ఉన్న ఈ వ్యర్థాలు, 2030కల్లా 15కోట్ల టన్నులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్మూలనలో ఎలాంటి శాస్త్రీయమైన పద్ధతిని అనుసరించకుండా, ఇంతే వేగంతో కనుక విచక్షణా రహితంగా చెత్త పేరుకుపోతే, చెత్తను నింపాల్సిన విస్తీర్ణం కూడా ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాల నిర్మూలనా ప్రక్రియ నిర్వహణకు శాస్త్రీయమైన పద్ధతులను పాటించడం చాలా అవసరం. విద్యుత్, భారీ ఉష్ణోగ్రత వినియోగంతో  చెత్తను కాల్చేయడం ద్వారా,  భూస్థాపితం చేయాల్సిన చెత్త పరిమాణాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ఇందుకోసం ప్లాస్మా ఆర్క్ గ్యాసిఫికేషన్  ప్రక్రియను ఘన వ్యర్థాల నిర్మూలనకు ఒక ప్రత్యామ్నాయంగా చేపట్టవచ్చు. పర్యావరణ హితమైన ఈ ప్రక్రియతో భారీ పరిమాణంలోని ఘన వ్యర్థాలను దాదాపు 95శాతంవరకూ తగ్గించడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో ప్లాస్మా ఆర్క్ రియాక్టర్ లో 3,000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతవద్ద ఘన వ్యర్ధాలను దహించడం వల్ల, వ్యర్థాల్లో చాలాభాగం  సిన్ గ్యాస్, లేదా సింథసెస్ గ్యాస్ అనే ఇంధనంగా మారుతుంది. ఈ సిన్ గ్యాస్ ను, గ్యాస్ శుద్ధీకరణ వ్యవస్థ ద్వారా ప్రవహింపజేసినపుడు అది విద్యుత్ ఉత్పత్తికి వాడే గ్యాస్ ఇంజిన్లకు ఇంధనంగా ఉపయోగపడుతుంది.

క్యాటలిస్ట్ కన్వర్టర్, రెడాక్స్ రియాక్టర్, సైక్లోన్ సెపరేటర్, స్క్రబర్, అండ్ కండిషనర్ల ద్వారా సిన్ గ్యాస్ ను ప్రవహింపజేసి, విద్యుత్ ఉత్పత్తి గ్యాస్ ఇంజిన్లలో ఉపయోగపడేలా రూపొంతరం చెందిస్తారు.  ప్లాస్మా ఆర్క్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో అవశేషంగా మిలిగే బూడిద పదార్థాన్ని సిమెంటుతో మిళితం చేసి రిసైక్లింగ్ పద్ధతిలో ఇటుకలను తయారు చేస్తారు.  నిర్మాణం రంగంలో ఈ ఇటుకలు ఉపయోగపడతాయి. అంటే ‘చెత్తనుంచి సంపద’ను తయారు చేసేందుకు వైజ్ఞానిక శాస్త్రం ఇలా దోహదపడుతుందన్నమాట.

 ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థికపరంగా  ఆచరణయోగ్యంగానీ, గిట్టుబాటుకానీ కాదు. ఎందుకంటే,.. చిన్న చిన్న ప్లాంట్లలో, (వంద మెట్రిక్ టన్నుల కంటే తక్కువ సామర్థ్యం కలిగిన పాంట్లలో) వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి కూడా భారీ స్థాయిలో విద్యుత్  అవసరమవుతుంది. అంటే, ఒక కిలోగ్రామ్ ఘనవ్యర్థాలను ప్రాసెస్ చేయడానికే 1.5కిలోవాట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఈ ప్రక్రియ నిర్వహణకు ఎప్పటికప్పుడు ఖర్ఛు భారీ స్థాయిలో ఉంటుంది. ఆర్థికపరంగా చూసినపుడు ఘన వ్యర్థాల నియంత్రణకు ఇది ఏ మాత్రం సమంజసమైన మార్గం కాదు.

భారతదేశంలోని పురపాలక సంఘాలు, ఇతర పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల పరిధిలో ఉత్పన్నమయ్యే ఘన వ్యర్థాలలో ఎక్కువ భాగం,.. (అంటే  50శాతంపైగా) సేంద్రియ వ్యర్థాలు ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి సేంద్రియ వ్యర్థాలను అశాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం, గ్రీన్ హౌస్ వాయువుల, కర్బన ఉద్గారాల, ఇతర కలుషితాల ఉత్పత్తికి దారి తీస్తుంది. మున్సిపల్ ఘన వ్యర్థాల నియంత్రణలో అసమర్థతవల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. భూమిపై పెద్దమొత్తంలో చెత్తను పేర్చడంతో ఆ ప్రాంతం, హానికరమైన సూక్ష్మక్రిములకు, బ్యాక్టీరియా, వైరస్ లకు కేంద్రంగా, కలుషితాల నిలయంగా మారుతుంది.

సర్వసాధారణంగా చేపట్టే "కంపోస్టింగ్" ప్రక్రియతో చెత్త నియంత్రణ వల్ల కూడా ఆర్థికంగా ప్రభావవంతమైన ఫలితాలు రావడంలేదు. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఎక్కువ విస్తీర్ణంలో స్థలం, ఎక్కువ మంది పనివారు అవసరమవుతారు. ఇందులో క్రిమిసంహార ప్రక్రియకు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందులో లోహసంబంధమైన భారీ అవశేషాల కాలుష్యం ఉంటుంది కాబట్టి కంపోస్ట్ వినియోగం కూడా చాలా పరిమిత స్థాయిలో ఉంటుంది. వర్షాకాలంలో అయితే, వాతావరణంలో మితిమీరిన చెమ్మ కారణంగా కంపోస్టింగ్ ప్రక్రియ కూడా చాలా కష్టతరంగా మారుతుంది.