మంగళవారం 19 జనవరి 2021
National - Jan 11, 2021 , 13:20:43

కేంద్ర ప్ర‌భుత్వంపై సుప్రీం సీరియ‌స్‌

కేంద్ర ప్ర‌భుత్వంపై సుప్రీం సీరియ‌స్‌

న్యూఢిల్లీ: రైతుల ఆందోళ‌న విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది సుప్రీంకోర్టు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లును మీరు నిలిపేస్తారా లేక మ‌మ్మ‌ల్ని ఆ ప‌ని చేయ‌మంటారా అంటూ ప్ర‌శ్నించింది. ఈ చ‌ట్టాల‌పై దాఖ‌లైన ప‌లు పిటిష‌న్ల‌పై సోమ‌వారం అత్యున్న‌త న్యాయ‌స్థానం విచారణ జ‌రిపింది. ఒక్క పిటిష‌న్ కూడా ఈ చ‌ట్టాలు ల‌బ్ధి చేకూర్చుతాయ‌ని చెప్ప‌లేద‌ని ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. విచార‌ణ‌లో భాగంగా చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా బోబ్డే కేంద్రం తీరుపై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. మేము ఏవో విచ్చ‌ల‌విడి వ్యాఖ్య‌లు చేయ‌ద‌ల‌చుకోలేదు కానీ కేంద్ర ప్ర‌భుత్వంపై చాలా అసంతృప్తిగా ఉంది. ఏం సంప్ర‌దింపుల ప్ర‌క్రియ కొన‌సాగుతుందో మాకు తెలియ‌దు. అస‌లు ఏం జ‌రుగుతోందో ద‌య‌చేసి చెబుతారా అంటూ బోబ్డే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

మీరు చేస్తారా.. మ‌మ్మ‌ల్ని చేయ‌మంటారా?

ఈ స‌మ‌స్య‌కు స్నేహ‌పూర్వ‌క ప‌రిష్కారం చూపాల‌న్న‌దే మా ఉద్దేశం. కానీ ఈ చ‌ట్టాల అమ‌లు నిలిపివేత‌పై ఎందుకు మాట్లాడ‌టం లేదు. ఒక‌వేళ కేంద్రం చ‌ట్టాల అమ‌లు నిలిపివేస్తే రైతుల‌ను చ‌ర్చ‌ల‌కు రావాల్సిందిగా మేము చెబుతాం. మీరైనా ఆ ప‌ని చేయండి లేదంటే కోర్టే చేస్తుంది అని బోబ్డే స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ఎన్నో ఆత్మ‌హ‌త్య‌లు, మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని, పిల్లలు, మ‌హిళ‌ల‌ను ర‌క్షించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రైతులు ఆందోళ‌న నిర్వ‌హించే స్థ‌లాన్ని మ‌రో చోటికి మార్చాల‌ని కోర్టు ప్ర‌తిపాదించింది. అయితే చ‌ట్టాల అమ‌లు నిలిపివేత మాత్రం కుద‌ర‌ద‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ కోర్టుకు స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.