బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 14:48:40

సహాయంలో సుష్మాజీ ముందుండేవారు: వెంకయ్య నాయుడు

సహాయంలో సుష్మాజీ ముందుండేవారు: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: సహాయం చేయడంలో సుష్మాజీ ముందుండే వారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సుష్మాజీ మా కుటుంబంలో సభ్యులవంటి వారని వెంకయ్య తెలిపారు. తమ కుటుంబం తొలిసారి ఢిల్లీలో ఉన్నప్పుడు ఆమెను సహాయం, సలహాలు కోరినట్లు ఆయన చెప్పారు. సుష్మాజీ మంచి మానవత్వం ఉన్న వ్యక్తి అని వెంకయ్య కొనియాడారు. ఎవరు ఏ సహాయం కోరినా తక్షణం స్పందించేవారని గుర్తు చేసుకున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు సామాజిక మాధ్యమం ద్వారా ఎవరు ఏ సహాయం కోరినా తక్షణం స్పందించి వారి కష్టాలను తీర్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. సష్మాజీ సహాయ మనస్తత్వం వల్ల విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఎంతో పేరు, ఖ్యాతి పొందారని వెంకయ్య నాయుడు తెలిపారు. 

సుష్మా స్వరాజ్‌ 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్‌మెంట్‌ ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి హర్‌దేశ్‌ శర్మ ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక సభ్యుడు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన సుష్మా స్వరాజ్‌ అనంతరం రాజకీయాల్లో రాణించారు. 25 ఏండ్ల వయస్సులోనే 1977లో అంబాలా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1987లోనూ మరోసారి ఆ స్థానం నుంచి గెలిచిన ఆమె రాష్ట్ర కార్మిక, ఉపాధి, విద్య, పౌరసరఫరా వంటి శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 27 ఏండ్ల వయసులో హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలయ్యారు. 1990 ఏప్రిల్‌న రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. నాటి 13 రోజుల వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉన్నారు. 1998 అక్టోబర్‌లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదే ఏడాది డిసెంబర్‌లో ఆ పదవికి రాజీనామా చేశారు. 1998 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఢిల్లీ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధాని వాజ్‌పేయి రెండో ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, టెలికాం శాఖల మంత్రిగా ఉన్నారు. 

1999 పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి స్థానం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పోటీ చేసిన సుష్మా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2000 ఏప్రిల్‌లో తిరిగి రాజ్యసభకు సుష్మ ఎన్నికయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ బాధ్యతలను నిర్వహించారు. 2006లో మధ్యప్రదేశ్‌ తరుఫున తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009 ఏప్రిల్‌ వరకు రాజ్యసభలో ఉప ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. 2009 పార్లమెంట్‌ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని విదిషా స్థానం నుంచి పోటీ చేసి 4 లక్షల మెజార్టీతో గెలిచారు. 2009 డిసెంబర్‌ 21 నుంచి 2014 వరకు అద్వానీ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా ప్రధాని మోదీ క్యాబినెట్‌లో విదేశాంగ మంత్రి బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఈ పదవి చేపట్టిన రెండో మహిళ సుష్మానే. విదేశాంగ శాఖ మంత్రిగా ఆమె ఎందరితో అండగా నిలిచి ఎన్నో ప్రశంసలు పొందారు. 15 ఏండ్లుగా పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన ద్యివ్యాంగురాలైన గీతను భారత్‌ రప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. అనారోగ్య కారణాలతో 2019 పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉన్న సుష్మా స్వరాజ్‌ అదే ఏడాది ఆగస్టు 6న గుండెపోటుతో చనిపోయారు. సుష్మా స్వరాజ్‌ తొలి వర్థంతి సందర్భంగా గురువారం పలువురు నేతలు ఆమెకు నివాళి అర్పించడంతోపాటు ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. సోదరి సుష్మాని చాలా మిస్‌ అవుతున్నానని ఇటీవల రక్షాబంధన్‌ సందర్భంగా వెంకయ్య నాయుడు అన్నారు. 
logo