గురువారం 02 జూలై 2020
National - Jun 20, 2020 , 16:52:06

రేపు సూర్యగ్రహణం.. ఎక్కడెక్కడ చూడొచ్చు

రేపు సూర్యగ్రహణం.. ఎక్కడెక్కడ చూడొచ్చు

ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఆదివారం ఉదయం సంభవించనున్నది. రింగ్ ఆఫ్‌ పైర్‌గా కనిపించే ఈ సూర్యగ్రహణంపై పరిశోధనలు జరిపేందుకు శాస్త్రవేత్తలు, జ్యోతిషులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను నేటి నుంచే మూసివేశారు. పలువురు ఇంటి నుంచి కూడా బయటకు రాకుండా చూసుకొంటున్నారు. 

సూర్యగ్రహణం ఆదివారం ఉదయం 10.42కు మొదలై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం12.24 గంటలకు మధ్యకు చేరే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా సమాంతరంగా వచ్చే సమయంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా కనిపించనున్నది.  మధ్యాహ్నం సమయంలో సూర్యుడిని చంద్రుడు కప్పేస్తాడు. అప్పుడు సూర్యుడు వజ్రపుటుంగరం మాదిరిగా దర్శనమిస్తాడు. ఈ గ్రహణాన్ని ఆఫ్రీకా, ఆగ్నేయ యూరప్‌, ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో పాక్షికంగా  వీక్షించేందుకు అవకాశాలు ఉన్నాయి. మధ్య ఆఫ్రీకా నుంచి భారత్‌ మీదుగా చైనా, తైవాన్‌ వరకు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వీక్షించొచ్చు. ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా తొలుత కాంగో దేశానికి చెందిన ఇన్ఫోండో పట్టణంలో కనిపిస్తుంది. ఇక్కడ కాంగో దేశ కాలమానం ప్రకారం ఉదయం 5.47 నిమిషాలకు ప్రారంభమవుతుంది. కాంగో మీదుగా దక్షిణ సూడాన్‌, ఇథియోపియాలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అరేబియా ద్వీపకల్పం యొక్క ఎర్ర సముద్రం, పాకిస్తాన్‌, ఉత్తర భారతదేశం, దక్షిణ చైనా, తైవాన్‌లోకి చేరుతుంది. మన దేశానికి వచ్చే సరిగా సమయం ఉదయం 10.27 అవుతుంది. మధ్యాహ్నం 12.09 గంటలకు మధ్యలోకి చేరుతుంది. 

సురక్షిత పద్ధతులతో వీక్షించాలి

గ్రహణం పట్టే సమయం కన్నా 12 గంటల ముందు కాలాన్ని సూతక్‌గా పిలుస్తారు. ఈ సమయంలో ఇంటికి నుంచి బయట కాలు పెట్టకూడదంటుంటారు. ఈ సమయంలో ఎలాంటి పనులు కూడా చేపట్టవద్దని పెద్దలు సూచిస్తుంటుంటారు. అయితే సైన్స్‌పరంగా అభివృద్ధిని సాధించిన సమయంలో ఇలాంటివి నమ్మకూడదని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. గ్రహణాలను నేరుగా వీక్షించాలని ఏ విజ్ఞానశాస్త్రంగానీ, ఏ శాస్త్రవేత్తగానీ సూచించరు. సరైన సంరక్షణ పద్ధతులను అనుసరించి మాత్రమే గ్రహణాలను వీక్షించాలి. లేకపోతే అది నేరుగా కళ్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మన శరీరంపై కూడా దాని ప్రభావం చూపిస్తుంది. గ్రహణాలను చూసేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన ఆల్ట్రా వయోలెట్‌ అద్దాలను వినియోగించి మాత్రమే గ్రహణాలను చూడటం శ్రేయస్కరం. కెమెరాలో బంధించాలను కొనే ఔత్సాహికులు ప్రత్యేక ఫిల్టర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆన్‌లైన్‌లో వీక్షించడం అన్నింటికన్నా సురక్షితమైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఖగోళ శాస్త్ర వెబ్‌కాస్ట్ సర్వీస్ స్లోహ్, సిర్సా ఇండియా, ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ సెంటర్, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ, ఇండియా సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ఈ ఈవెంట్‌ను YouTube ఛానెల్‌లలో ప్రత్యక్షంగా చూడవచ్చు.


logo