ఆదివారం 31 మే 2020
National - May 09, 2020 , 17:54:26

38 రోజులు వెంటిలేటర్‌పై.. కోలుకుని ఇంటికి

38 రోజులు వెంటిలేటర్‌పై.. కోలుకుని ఇంటికి

హైదరాబాద్: కోల్‌కతాలో ఓ వ్యక్తి కరోనాపై సుదీర్ఘపోరు అనంతరం ఎట్టకేలకు విజయం సాధించాడు. 38 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉన్న52 సంవత్సరాల నితాయ్‌దాస్ ముఖర్జీ కోలుకుని ఇంటికి చేరుకున్నప్పుడు అందరూ చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. అన్ని రోజులు వెంటిలేటర్‌పై గడిపినవారు బతికి బయటకు రావడం మాటలు కాదు. చాలామంది తట్టుకోలేరు. డాక్టర్లు ఆశలు వదులుకుంటారు. కానీ ముఖర్జీ బతికి బట్టకట్టడం ఓ మిరాకిల్ అంటున్నారు. 2017లో ఆయనకు నిమోనియా వచ్చిపోయింది. గత మార్చి మధ్యలో జలుబు, దగ్గు  పట్టుకున్నాయి. ఇవి మామూలుగా వచ్చేవేనని కుటుంబ సభ్యులు భావించారు. కానీ తర్వాత జ్వరం రావడంతో మార్చి 29న ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. అదేరోజు రాత్రి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. మరుసటిరోజు కరోనా పాజిటివ్ వచ్చింది. పరిస్థితి మరింత దిగజారడంతో గొంతు దగ్గర రంధ్రం చేసి ఊపిరి తిత్తులలోకి నేరుగా ఆక్సిజన్ వెల్లే ఏర్పాటు చేశారు. పరిస్థితి ఏమాత్రం బాగాలేదని డాక్టర్లు చెప్పారని, అయినా వారు ఆశ మాత్రం వదులుకోలేదని ముఖర్జీ భార్య అపరాజిత చెప్పారు. అన్నిరోజులు వెంటిలేటర్‌పై ఉండి కోలుకుని ముఖర్జీ ఓరకంగా రికార్డు నెలకొల్పారని వైద్యులు చెప్పారు. తనకు అహోరాత్రులు సేవచేసి బతికించిన వైద్యులకు ముఖర్జీ కృతజ్ఞతలు తెలిపారు. 'వారు నాకు రెండో జీవితం ప్రసాదించారు' అని ఆయన చేతులెక్కి మొక్కారు.


logo