శుక్రవారం 03 జూలై 2020
National - Jan 15, 2020 , 02:23:46

ఆ నలుగురికి ఇక ఉరే

ఆ నలుగురికి ఇక ఉరే
  • క్యురేటివ్‌ పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • నలుగురు దోషులకు 22న తప్పని ఉరి
  • రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన ముఖేశ్‌సింగ్‌

న్యూఢిల్లీ, జనవరి 14: నిర్భయ కేసులో మరణశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఇద్దరు ఉరిని తప్పించుకునేందుకు చట్టపరంగా చేసిన ఆఖ రి ప్రయత్నం నిష్ఫలమైంది. కోర్టు విధించిన మరణశిక్షపై ఇద్దరు దోషులు దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఢిల్లీ స్థానిక కోర్టు జారీ చేసిన వారంట్‌ ప్రకారం ఈ నెల 22న ఆ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు అనివార్యమైంది. అయితే దోషుల్లో ఒకడైన ముఖేశ్‌సింగ్‌ చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి మంగళవారం లేఖరాశారు. ఇద్దరు దోషులు వినయ్‌ శర్మ, ముఖేశ్‌సింగ్‌ దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. వీటిలో విచారణ అర్హమైన అంశమేదీ లేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఢిల్లీ స్థానిక కోర్టు నలుగురు దోషులకు ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైలులో ఉరిశక్షను అమలు చేయాలని ఆదేశిస్తూ వారంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

క్యురేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం పట్ల నిర్భయకు చెందిన గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీహార్‌లోని మెడావార్‌ కాలా గ్రామ ప్రజలంతా స్వాగతించారని నిర్భయ తాత లాల్జీసింగ్‌ చెప్పారు. ఆ నలుగురిని ఉరితీసిన రోజు తమకు ‘దీపావళి’ అని అన్నారు. మరోవైపు దోషుల్లో ఒకడైన ముఖేశ్‌సింగ్‌ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాడు. తనపై మరణశిక్ష అమలుకు జారీ చేసిన డెత్‌వారంట్‌ను నిలుపుదల చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుగనుంది. 


logo