సాగు చట్టాలపై సుప్రీం స్టే.. చర్చల కోసం కమిటీ

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై కమిటీని ఏర్పాటు చేయబోనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. తాము ఏర్పాటు చేయబోయే కమిటీకి రైతులు సహకరించాలని కోర్టు చెప్పింది. అన్ని రైతు సంఘాల నుంచి కమిటీ అభిప్రాయాలను సేకరించాలని చీఫ్ జస్టిస్ బోబ్డే తెలిపారు. న్యాయ ప్రక్రియ పట్ల రైతు సంఘాలు విశ్వసనీయత చూపాలన్నారు. రైతులు సహకరించాలని, ఈ సమస్యను పరిష్కరించడమే తమ ఉద్దేశం అని సీజే అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కావాలనుకుంటే, అప్పుడు కోర్టు జోక్యం అవసరమని లేదంటే మీరు ఆందోళన కొనసాగించవచ్చు అని సీజే అన్నారు. వ్యవసాయ చట్టాల అంశంపై విచారణ జరిగిన సమయంలో పిటీషనర్ల తరపున ఎంఎల్ శర్మ మాట్లాడారు. ప్రధాని మోదీ రైతులను ఒకేసారి కలిసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మాత్రమే నిర్ణయం తీసుకోగలరన్నారు.
అమలుపై స్టే..
అయితే ఈ విషయంలో తాము ప్రధానికి ఎటువంటి దిశానిర్దేశం చేయలేమని సీజే న్నారు. రైతు సంఘాలతో ఇద్దరు కేంద్ర మంత్రులు చర్చించినట్లు సొలిసిటర్ జనరల్ హారీశ్ సాల్వే తెలిపారు. ప్రస్తుతానికి వ్యవసాయ చట్టాలను సస్పెండ్ చేస్తున్నామని, కానీ శాశ్వతంగా ఆ చట్టాలను సస్పెండ్ చేయలేమని సీజే తెలిపారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియను సాల్వే స్వాగతించారు. రాజకీయ లబ్ది కోసం న్యాయ విధానం సాగవద్దన్నారు. కేవలం ఉద్రిక్తతను తగ్గించేందుకు, ఉత్సాహాన్ని నింపేందుకు చట్టాలపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు హరీశ్ సాల్వే తెలిపారు. తదుపరి ఆదేశాల వచ్చే వరకు సాగు చట్టాలపై స్టే కొనసాగుతుందని సుప్రీం పేర్కొన్నది. న్యాయ కమిటీలో నలుగురు సభ్యులు ఉండనున్నారు. వ్యవసాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.