గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 02, 2020 , 14:48:41

కమల్‌నాథ్‌ స్టార్‌ ప్రచారకుడి హోదా రద్దుపై సుప్రీంకోర్టు స్టే

కమల్‌నాథ్‌ స్టార్‌ ప్రచారకుడి హోదా రద్దుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. స్టార్‌ ప్రచారకుడిగా ఆయన హోదాను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేయడంపై స్టే విధించింది. మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా అక్టోబర్‌ 13న సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌పై కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు, అక్టోబర్‌ 18న గ్వాలియర్ బీజేపీ అభ్యర్థిని ఇమర్తి దేవిని ‘ఐటమ్‌’గా ఆయన అభివర్ణించడాన్ని ఈసీ సీరియస్‌గా పరిగణించింది. స్టార్‌ ప్రచారకుడి జాబితా నుంచి కమల్‌నాథ్‌ను తప్పిస్తున్నట్లు అక్టోబర్‌ 30న పేర్కొంది. ఇకపై ఆయన పాల్గొన్న ప్రచార వ్యయం సంబంధిత అభ్యర్థి లెక్కలోకి వస్తుందని తెలిపింది.

మరోవైపు కమల్‌నాథ్‌ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆయన పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్‌ 77 ప్రకారం ఒక పార్టీ నేత ఎవరు అనేది నిర్ణయించే అధికారం ఈసీకి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించింది. కమల్‌నాథ్‌ తరుఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. మరోవైపు ఈసీ తరుఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్ ద్వివేది హాజరయ్యారు. మంగళవారం ఉప ఎన్నికలు జరుగనుండగా ప్రచారం ముగియడంతో ఈ అంశానికి ప్రాధాన్యత లేదని చెప్పారు.

దీంతో స్పందించిన  సుప్రీంకోర్టు కమల్‌నాథ్ స్టార్‌ ప్రచారకుడి హోదా రద్దు చేసే అధికారం ఈసీకి లేదని తెలిపింది. ఈసీ జారీ చేసిన ఈ ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. కమల్‌నాథ్‌ పిటిషన్‌పై ప్రతిస్పందన తెలుపాలని ఈసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.